Chandrababu Modi Meet: హాట్ టాపిక్‌గా మోదీ-చంద్రబాబు మీటింగ్, చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఇలా!
2018 నుంచి ఇప్పటిదాకా చంద్రబాబు, మోదీ ఎప్పుడూ కలుసుకోలేదు. తాజాగా ఈ ఇద్దరూ నేతలు ఇలా భేటీ కావడం రాజకీయ వర్గాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. శనివారం నాడు ఢిల్లీలో చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, మోదీ అక్కడే పక్కకు వెళ్లి కాసేపు ముచ్చటించారు. వీరిద్దరూ తాజా రాజకీయ పరిణామాలు, వివిధ అంశాలపై మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన దేశ ఢిల్లీలో శనివారం (ఆగస్టు 6) సాయంత్రం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ మీటింగ్ జరిగింది. రాష్ట్రపతి భవన్ కల్చరల్ హాలులో జరిగిన ఈ సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ఆహ్వానం అందింది. ఆ మేరకు చంద్రబాబు నాయుడు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు, కేంద్ర మంత్రులు సహా వివిధ పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత.. ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు 10 నిమిషాల పాటు వీరిద్దరూ అదే కార్యక్రమం అనంతరం మాట్లాడుకోవడం ఆసక్తికరంగా కనిపించింది.
Glimpses from Sri NCBN's visit to Delhi to attend a meeting chaired by Prime Minister Sri Narendra Modi Ji regarding organisation of Azadi Ka Amrit Mahotsav#CBNInDelhi pic.twitter.com/cwNYyshrlH
— Telugu Desam Party (@JaiTDP) August 6, 2022
మళ్లీ కలుద్దామన్న మోదీ!
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నేషనల్ కమిటీ మీటింగ్ ముగిశాక చంద్రబాబు ప్రధాని మోదీతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఆ మీటింగ్ కు వచ్చిన వారు టీ, స్నాక్స్ తీసుకుంటుండగా.. ప్రధాని పలువురిని పలకరించారు. చంద్రబాబు దగ్గరికి కూడా వచ్చారు. కొద్దిసేపు పక్కకు జరిగి ఇద్దరూ 5 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. అప్పుడప్పుడూ ఢిల్లీకి రావాలని చంద్రబాబుతో ప్రధాని అన్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. మరోసారి ఢిల్లీకి వచ్చినప్పుడు ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడుకుందామని చంద్రబాబు చెప్పగా, అందుకు మోదీ సరేనన్నట్లు తెలిసింది.
2018 నుంచి దూరంగానే
2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేసి, ఎన్డీయేకు మద్దతు పలికిన చంద్రబాబు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ 2018లో కూటమిలో నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. అప్పుడే పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. ప్రత్యేక హోదా కోసం తీవ్రంగా పోరాడారు. కానీ, ఆ ఎన్నికల్లో టీడీపీకి ఏపీలో ఘోర పరాభవం, బీజేపీకి దేశ వ్యాప్తంగా పెద్ద ఆదరణ లభించింది. ఇక ఆ ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటిదాకా చంద్రబాబు, మోదీ ఎప్పుడూ కలుసుకోలేదు. తాజాగా ఈ ఇద్దరూ నేతలు ఇలా భేటీ కావడం రాజకీయ వర్గాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉండే అవకాశం ఉందని ఇప్పటికే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు మోదీ ఇలా మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తర్వాత ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా సభ్యులతో పాటు జాతీయ మీడియాకు చెందిన ప్రతినిధులు చంద్రబాబు నాయుడును కలిశారు. వారితో చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై పరోక్షంగా ప్రశంసలు కురిపించినట్లు తెలిసింది.
కొవిడ్ సంక్షోభం, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం సహా అనేక విపత్తులు ఎదురైనా పలు దేశాలతో పోలిస్తే భారత్ తట్టుకుని నిలబడగలిగిందని జాతీయ మీడియా ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు అన్నారు. యూరప్ సహా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ గట్టిగా నిలబడిందని పేర్కొన్నారు. అనేక దేశాలతో పోలిస్తే, భారత్‌లో ప్రజల తలసరి ఆదాయం ఎక్కువగా ఉందన్నారు. ఏపీలో వైఎస్ జగన్ పాలనపై విమర్శలు చేశారు. ఇంకా తమిళ ప్రఖ్యాత నటుడు, ఎంపీ రజినీకాంత్, కేంద్ర మంత్రి గడ్కరీ, సీతారాం ఏచూరి సహా పలువురు నేతలు, ప్రముఖులతోనూ చంద్రబాబు మాట్లాడుతూ కనిపించారు.
#CBNInDelhi pic.twitter.com/voBrqJawQT
— Telugu Desam Party (@JaiTDP) August 6, 2022