Chandrababu News: రేపటి నుంచి ఏపీలో ఈ ఆఫీస్ మూసివేత - గవర్నర్‌కు చంద్రబాబు లేఖ
AP Latest News: ఏపీ ఈ - ఆఫీస్ వెబ్ సైట్ ను కొద్ది రోజుల పాటు మూసేయనున్నారు. సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ అని.. అందుకే మే 17 నుంచి 25 వరకూ ఆ వెబ్ సైట్ మూసి ఉంటుందని వెల్లడించింది.
E Office Closing in AP: టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లేఖ రాశారు. ఏపీలో రేపటి (మే 17) నుంచి ఈ - ఆఫీస్ పోర్టల్ తాత్కాలికంగా మూసేయనున్నందున ఈ వ్యవహారంపై చంద్రబాబు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ - ఆఫీస్ ను ఈ సమయంలో అప్‌గ్రేడ్ చేయడాన్ని చంద్రబాబు వ్యతిరేకించారు. కొత్త ప్రభుత్వం వస్తోన్న వేళ దాన్ని అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదని లేఖలో పేర్కొన్నారు. ఈ - ఆఫీస్ వ్యవహారంలో అక్రమాలు జరిగే అవకాశం ఉందని.. మే 17 నుంచి 25 వరకు అప్‌గ్రేడ్ పేరుతో దాన్ని మూసివేయవద్దని గవర్నర్ ను కోరారు.
టీడీపీ ఆరోపణలు ఇవీ
ఏపీ ఈ - ఆఫీస్ వెబ్ సైట్ ను కొద్ది రోజుల పాటు మూసేయనున్నారు. సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ అని ప్రభుత్వం చెబుతోంది. అందుకే మే 17 నుంచి 25 వరకూ ఆ వెబ్ సైట్ మూసి ఉంటుందని వెల్లడించింది. దీంతో ఇది జగన్ సర్కారు తీసుకున్న మరో అనుమానాస్పద నిర్ణయంగా చూస్తున్నారు. ‘ఈ-ఆఫీ్‌స’ వెబ్ సైట్ ను అన్ని రోజులు మూసేయడం వెనుక చీకటి కోణాలు ఉన్నాయని టీడీపీ ఆరోపిస్తోంది.
గ్రామ, వార్డు సచివాలయాలకు కూడా ఈ- ఆఫీస్ సేవలను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న ఈ - ఆఫీస్ వెర్షన్‌ను అప్‌గ్రేడ్ చేయడం కోసం కొద్ది రోజులు ఆ సేవలను నిలుపుతున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం ఈ ఐదేళ్ల కాలంలో మద్యం లావాదేవీలు, డీలింగ్స్, బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులకు సంబంధించిన ఫైళ్లను మాయం చేస్తుందని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం మారితే.. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం తమను వేధిస్తుందన్న భయంతోనే వైసీపీ ప్రభుత్వం అన్నీ చక్కబెట్టుకుంటున్నట్లుగా టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి జగన్ ప్రభుత్వం తాను తీసుకొచ్చిన జీవోల వివరాలు వెబ్ సైట్ లో ఉంచేది కాదు. ఆ విషయంలో హైకోర్టు నుంచి ఎన్నో మొట్టికాయలు తిన్నది. 2008లో ప్రారంభం అయిన జీవోఐఆర్ వెబ్‌సైట్‌ను జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత పూర్తిగా మూసేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన, లేదా నిర్ణయాలకు సంబంధించిన అన్ని గవర్నమెంట్ ఆర్డర్లు ఆ జీవోఐఆర్ లో ప్రతి ప్రభుత్వం బహిరంగంగా పెట్టేది. సామాన్యులు ఎవరైనా ఆ వెబ్ సైట్ ను చాలా ఈజీగా చూడవచ్చు. జీవోలు డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు. కానీ, జగన్ ప్రభుత్వం మాత్రం ఆ సైటు మూసేసింది. ప్రభుత్వ నిర్ణయాల తాలూకు డేటా, ఫైల్స్ అన్నీ ఈ-ఆఫీ్‌సలో ఉంటాయి. ఇప్పుడు దీన్నే సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ పేరుతో కొద్ది రోజులు మూసేస్తుండడం పట్ల టీడీపీ ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తోంది.