AP Governance Progress Report: విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏపీ - రెండేళ్ల పాలనపై ఆర్థిక ప్రగతి నివేదిక విడుదల చేసిన సీఎం చంద్రబాబు!
Economic Growth GSDP : ఎన్డీఏ కూటమి రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రొగ్రెస్ రిపోర్ట్ విడుదల. ఏపీ జిఎస్‌డిపి, తలసరి ఆదాయం, ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణంపై చంద్రబాబు పూర్తి వివరాలు వెల్లడించారు.

AP Alliance Two Years Governance Progress Card: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, సంక్షేమ-అభివృద్ధి పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్ర ప్రొగ్రెస్ రిపోర్ట్ ను విడుదల చేశారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2019-2024 మధ్య కాలంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సాగించిన వేధింపులు, అణచివేత చర్యల వల్లనే ప్రజలు నిశ్శబ్ద విప్లవం ద్వారా తమ కూటమికి 57 శాతం ఓట్లు, 94 శాతం స్ట్రైక్ రేట్‌తో చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారని గుర్తుచేశారు. అధికారం చేపట్టిన కొత్తలో గత వైఫల్యాలను ఎండగడుతూ ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామని, ఇప్పుడు ఆ శ్వేతపత్రాల కొనసాగింపుగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తాము చేపట్టిన చర్యల యాక్షన్ టేకెన్ రిపోర్టును ప్రజల ముందుంచుతున్నామని సీఎం స్పష్టం చేశారు.
2014 రాష్ట్ర విభజననాటి పరిస్థితులను చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సంపదను కోల్పోయి, రాజధాని కూడా లేక బస్సుల నుంచే పాలన సాగించినప్పటికీ.. మొదటి విడతలో రాష్ట్రాన్ని దారిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమించామన్నారు. విభజన సమయంలో నాటి ఉమ్మడి రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ. 95,231 కాగా, విభజన అనంతరం తెలంగాణ తలసరి ఆదాయం రూ. 1,24,104కు పెరిగి, ఏపీ ఆదాయం రూ. 93,903కు పడిపోయిందని గణాంకాలను వివరించారు. విభజన వల్లే ఇరు రాష్ట్రాల మధ్య రూ. 30,201 భేదం ఏర్పడిందని, అయితే 2019 నాటికి తాము నిలబెట్టిన రాష్ట్ర ప్రాభవాన్ని.. గత ఐదేళ్ల పాలనతో దారుణంగా దెబ్బతీశారని ఆరోపించారు.
గత ప్రభుత్వ వైఖరి వల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ ఘోరంగా పడిపోయిందని, పారిశ్రామికవేత్తలు భయపడి రాష్ట్రం విడిచి పారిపోయారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసులు, అధికారులు భయంతో బతికేలా వాతావరణం సృష్టించారని దుయ్యబట్టారు. ఇతర రాష్ట్రాల్లో ఏపీ వాసులను చిన్నచూపు చూసే పరిస్థితి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. ఆదాయం రావాలన్నా, ఉద్యోగాలు లభించాలన్నా పెట్టుబడులు అత్యంత కీలకమని, అందుకే ఆర్థిక వ్యవస్థను మళ్లీ స్థిరత్వంలోకి తెచ్చేందుకు గడిచిన రెండేళ్లలో ప్రత్యేక సంస్కరణలు, నూతన పారిశ్రామిక విధానాలు తెచ్చామన్నారు.
పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ, తమ సమర్థవంతమైన ప్రణాళికల వల్ల రాష్ట్రాన్ని పునర్నిర్మాణ మార్గంలో నడిపిస్తున్నామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల సంక్షోభం నుంచి కోలుకుంటూ ఏపీ జీఎస్‌డీపీ 13.5 శాతంగా నమోదు కావడం, సీఏజీఆర్ వృద్ధి 30.5 శాతానికి చేరడం చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. అప్పుల-జీఎస్‌డీపీ నిష్పత్తిని 28.38 శాతంగా నియంత్రిస్తూనే, తెలంగాణతో ఉన్న ఆదాయ అంతరాన్ని 10 శాతం నుంచి 8 శాతానికి తగ్గించగలిగామని గణాంక సహితంగా వెల్లడించారు.
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నామని సీఎం వివరించారు. ఇచ్చిన హామీల మేరకు చెప్పిన తేదీల్లోనే ఎవ్వరూ ఊహించని విధంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు ఇరిగేషన్, స్టీల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ, ఫార్మా రంగాల్లో భారీ ఎత్తున ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నామని ప్రకటించారు. బ్రాండ్ ఏపీని తిరిగి పునరుద్ధరించి, పెట్టుబడుల ప్రవాహంతో ప్రతి కుటుంబంలో ఆదాయం పెంచడమే తమ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















