Chandrababu Letter to ACB Judge: 'నన్ను అంతమొందించేందుకు కుట్ర' - ఏసీబీ న్యాయమూర్తికి చంద్రబాబు లేఖ
Chandrababu letter: జైల్లో తన భద్రతపై అనుమానంగా ఉందంటూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. మరోవైపు, ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి వైదొలిగారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు. జైలు అధికారుల ద్వారా జడ్జికి లేఖ పంపారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ తన ఆవేదనను లేఖలో పేర్కొన్నారు. తనను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారని అన్నారు. ఈ నెల 25న 3 పేజీల లేఖను న్యాయమూర్తికి రాశారు.
లేఖలోని అంశాలివే
'నాకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది. నేను జైల్లోకి వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫోటోలు తీసి స్వయంగా పోలీసులే లీక్ చేశారు. నా ప్రతిష్టను దెబ్బ తీసేందుకే ఈ తరహా వీడియో రిలీజ్ చేశారు. నన్ను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారు. తూ.గో జిల్లా ఎస్పీకి దీనికి సంబంధించిన లేఖ కూడా వచ్చింది. ఆ లేఖపై కూడా పోలీస్ అధికారులు ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.' అంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
భద్రతపై ఆందోళన
ఈ సందర్భంగా జైలులో తన భద్రతపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. 'ఎస్ కోటకు చెందిన ఓ నిందితుడు జైల్లో పెన్ కెమెరాతో విజువల్స్ తీస్తున్నారని నా దృష్టికి వచ్చింది. నా కదలికలపై జైలులో అనధికారికంగా డ్రోన్లతో నిఘా పెడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్న వారే డ్రోన్లు ఎగరేస్తున్నారని భావిస్తున్నాను. దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ లేవు. ఈ నెల 6న నన్ను కలవడానికి నా కుటుంబ సభ్యులు వచ్చిన సందర్భంలోనూ సెంట్రల్ జైల్ గేట్ వద్ద మరో డ్రోన్ ఎగరేశారు. నా భద్రతే కాదు.. నా కుటుంబ సభ్యులకూ ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనతో ఉన్నా. నాలుగున్నరేళ్లలో నాపై వివిధ సందర్భాల్లో అధికార పక్షం వారు దాడి చేశారు. గంజాయి ప్యాకెట్లు జైలు ప్రాంగణంలో గార్డెనింగ్ చేస్తున్న ఖైదీల వద్ద విసిరేస్తున్నారు.' అంటూ చంద్రబాబు లేఖలో న్యాయమూర్తికి వివరించారు.
ఇక్కడి ఖైదీల్లో 750 మంది తీవ్ర నేరాలకు పాల్పడిన వారు ఉన్నారని, కొందరు ఖైదీల వల్ల తనకు తీవ్ర ముప్పు పొంచి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే 2019లో తన భద్రతను తగ్గించారని గుర్తు చేశారు. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా ఉదాహరణలే ఉన్నాయని వివరించారు.
మరో షాక్
మరోవైపు, స్కిల్ కేసులో చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ నుంచి న్యాయమూర్తి వైదొలిగారు. ఈ పిటిషన్ వెకేషన్ బెంచ్ ముందు విచారణకు రాగా, 'నాటి బిఫోర్ మీ' అంటూ న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ నుంచి తప్పుకొన్నారు. దీంతో ఈ పిటిషన్ ను ఏ బెంచ్ విచారించాలనే అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 19న ఈ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం వెకేషన్ బెంచ్ ముందుకు వాయిదా వేసింది.
కాల్ డేటా పిటిషన్ పై 31న తీర్పు
అటు, చంద్రబాబు అరెస్ట్ సమయంలో సీఐడీ కాల్ డేటా ఇవ్వాలన్న పిటిషన్ పైనా ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ అంశంపై ఈ నెల 31న తీర్పు ఇవ్వనున్నట్లు ఏసీబీ కోర్టు వెల్లడించింది. కాగా, చంద్రబాబును అరెస్ట్ చేసే సమయానికి ముందు సీఐడీ అధికారులు పలువుర్ని ఫోన్ ద్వారా సంప్రదించారని, ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయని చంద్రబాబు తరఫు న్యాయవాది గత విచారణ సందర్భంగా వాదించారు.