visakha steel plant: జగన్ ముందుకు వచ్చి ఉక్కు పరిశ్రమ కోసం పోరాడాలి... టీడీపీ చీఫ్ చంద్రబాబు డిమాండ్
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటంలో జగన్ ముందు ఉండి నడిపించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. పోరాట సంఘాలకు లేఖ రాసిన ఆయన కీలక అంశాలు ప్రస్తావించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటంలో సీఎం జగన్ ముందుండి పోరాడాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు డిమాండ్ చేశారు. అవసరం అయితే తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. దీనికి తెలుగు దేశం పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితికి లేఖ రాసిన చంద్రబాబు... పార్లమెంట్ లోపల, బయట జరిగే పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని వివరించారు. సీఎం జగన్ కూడా కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి మద్దతు తెలిపి ఉద్యమాన్ని ముందుండి నడిపించాలని సూచించారు.
ALSO READ: ఆ పని చేయండి... విశాఖ ఉక్కు పరిశ్రమకు లాభాలు రాకుంటే అడగండి... మంత్రికి విజయసాయి విజ్ఞప్తి
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..ఐక్యంగా చేస్తున్న పోరాటానికి హృదయపూర్వక అభినందనలు తెలిపిన చంద్రబాబు... తెలుగు ప్రజలు 1960లో కుల, మత, ప్రాంతీయ భావాలకు అతీతంగా ఒక్కటై ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో పోరాడి ఈ కర్మాగారాన్ని సాధించుకున్నారని గుర్తు చేశారు. ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి 1992లో నిర్మాణం పూర్తి చేసి కార్మాగారాన్ని జాతికి అంకితమిచ్చారన్నారు చంద్రబాబు. దాదాపు రూ.4 వేల కోట్ల మేర నష్టాలు చవిచూసిన క్రమంలో 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజపేయీ ప్రభుత్వ హయాంలోనే కర్మాగారం ప్రైవేటీకరణ అంశం తెరమీదకు వచ్చిందని... అప్పట్లో తమ పోరాటంతో వాళ్లు వెనక్కి తగ్గారని గుర్తు చేశారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం, వ్యక్తిగతంగా తాను అభ్యర్థించడంతో కర్మాగారానికి రూ.1,333 కోట్లతో పునర్నిర్మాణ ప్యాకేజీ భారత ప్రభుత్వం ప్రకటించిందని లేఖలో పేర్కొన్నారు. అప్పుడు కర్మాగారం మళ్లీ లాభాల బాటపట్టిందని... ఇప్పుడూ అలాంటి ప్రయత్నాలు జరగాలని సూచించారు.
ALSO READ: బెస్ట్ జాబ్ సైట్స్ ఇవే..
కర్మాగారాన్ని రక్షించేందుకు ఇప్పుడు కార్మికులు చేస్తున్న పోరాటానికి టీడీపీ తరఫున, తన తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మాట ఇస్తున్నామన్నారు చంద్రబాబు. అంతా ఐక్యంగా పోరాడితేనే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ నుంచి కాపాడుకోగలమని లేఖలో వివరించారు.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని విజ్ఞప్తి చేసిందీ బృందం. ఈ నేపథ్యంలో చంద్రబాబు లేఖ రాశారు. గతంలో టీడీపీ లీడర్లు స్టీల్ ప్లాంట్ కోసం ఆందోళనలు కూడా చేశారు. అయితే వైసీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని విమర్శలు చేస్తోంది టీడీపీ.
ALSO READ:సెలవు రోజుల్లో కూడా జీతాలు, పింఛన్ డబ్బులు... ఆర్బీఐ శుభవార్త