Union Minister in AP: ఒకే రోజు ఏపీలో ఇద్దరు కేంద్ర మంత్రుల పర్యటన! అందుకోసమేనా?
Smriti Irani And Bharathi Praveen Pawar: కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఆదివారం ఏపీలో పర్యటించనున్నారు.
Smriti Irani And Bharathi Praveen Pawar: ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రోజు ఇద్దు కేంద్ర మహిళా మంత్రులు పర్యటించనున్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఆదివారం ఏపీలో పర్యటించనున్నారు. స్మృతి ఇరానీ విశాఖలో పర్యటించనుండగా, భారతి ప్రవీణ్ పవార్ విజయవాడలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి దేవి ఘన స్వాగతం పలికారు. ఇరువురు మంత్రులు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఏపీ మద్యం బ్రాండ్లపై ఏపీ బీజేపీ పోరాటం
కొద్ది కాలంగా పురందేశ్వరి దేవి ఆధ్వర్యంలో ఏపీ బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం విక్రయాలపై పోరాటం చేస్తోంది. పలు మద్యం దుకాణాలను తనిఖీ చేస్తున్నారు. ఏపీలో మద్యం మాఫియా చెలరేగిపోతోందని, నకిలీ మద్యం ప్రజలకు ప్రాణాంతకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ మద్యాన్ని వెంటనే అరికట్టాలని వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై సీబీఐ విచారణ కోరతామని, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని కొద్ది రోజులుగా పురందేశ్వరి చెబుతూ వస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరాని విశాఖకు రావడంతో రాష్ట్రంలో నకిలీ మద్యం గురించి కేంద్రానికి వివరించారని అందుకే ఈ పర్యటన జరుగుతోందని బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు.
సీబీఐ విచారణకు డిమాండ్
ఏపీలో మద్యం మాఫియా చెలరేగిపోతోందని, నకిలీ మద్యం ప్రజలకు ప్రాణాంతకంగా మారిందని ఏపీ బీజేప అధ్యక్షురాలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐ విచారణను తప్పనిసరిగా కోరుతామని స్పష్టం చేశారు. ప్రతిరోజు మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనధికారింగా వైసీపీ నాయకుల జేబుల్లోకి భారీ మొత్తాలు వెళ్తున్నాయనే విషయాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు. ప.గో. జిల్లా నరసాపురంలో ప్రభుత్వ మద్యం దుకాణాన్ని తనిఖీ చేయగా, అక్రమాలు బయటపడ్డాయన్నారు. రూ.లక్ష వరకు ఆ సమయానికి విక్రయాలు జరిగితే.. అందులో డిజిటల్ చెల్లింపులు జరిపింది కేవలం రూ.700 మాత్రమేనని తమ పరిశీలనలో తేలిందని వివరించారు.
రూ. వేల కోట్లు దారి మళ్లుతున్నాయన్న ఏపీ బీజేపీ ఆరోపణలు
లిక్కర్ బాండ్ల ద్వారా రాష్ట్రప్రభుత్వం రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చింది. మద్యం తయారీ కంపెనీల నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కు రూ.300-400 కోట్ల ముడుపులు అందుతున్నాయని పురందేశ్వరి ఆరోపించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక 2024 నాటికి మద్యం విక్రయాలను ఐదు నక్షత్రాల హోటళ్లకే పరిమితం చేసి, ఆ తర్వాతే ఓట్ల కోసం మీ వద్దకు వస్తానని జగన్ చెప్పారని కానీ ఇప్పుడు మాట మార్చారన్నారు. మద్యం తయారీ కంపెనీల యజమానులను బెదిరించి, అధికారపార్టీ ముఖ్యనేతలు వాటిని చేజిక్కించుకున్నారని ఆరోపించారు.
ఆ డబ్బు అంతా ఏమైపోతోంది?
లీటరు మద్యం రూ.15కు తయారవుతుంటే రూ.600 నుంచి రూ.800 మధ్య విక్రయిస్తున్నారని పురందేశ్వరి ఆరోపించారు. రూ.25వేల కోట్లు ఎక్కడికి పోతున్నాయి? గతంలో రాష్ట్రప్రభుత్వానికి మద్యం ద్వారా ఏడాదికి రూ.15 వేల కోట్ల ఆదాయం వస్తే వైసీపీ పాలనలో ఇది రూ.32 వేల కోట్లకు పెరిగిందన్నారు. రోజుకు 80 లక్షల మంది మద్యం తాగుతున్నారని. ఒక్కొక్కరు రూ.200 చొప్పున ఖర్చుపెడితే, రూ.160 కోట్ల వరకు ఆదాయం వస్తుందని. నెలకు రూ.4,800 కోట్లు వస్తుందని, ఏడాదికి రూ.57,600 కోట్లు. బడ్జెట్లో రూ.32 వేల కోట్లే ఆదాయంగా చూపిస్తున్నారని . మిగిలిన రూ.25వేల కోట్లు ఏమైంది? ఎక్కడికెళ్తోందని ప్రశ్నించారు.