AP Voters: జనవరి 22న ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదల, మహిళా ఓటర్లే అధికం
CEC Rajiv Kumar: మూడు రోజుల పాటు ఏపీలో సీఈసీ అధికారులు పర్యటించారు. సోమవారం ఎన్నికల అధికారులతో సమావేశమవ్వగా.. మంగళవారం రాజకీయ పార్టీలతో భేటీ అయ్యారు.
Andhra Pradesh Elections 2024: ఏపీలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్దమవుతోంది. ఇప్పటినుంచే ఏర్పాట్లు మొదలుపెట్టింది. షెడ్యూల్ ప్రకారం లోక్‌సభ ఎన్నికలతో పాటు మార్చి లేదా ఏప్రిల్‌లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు (AP Elections 2024) జరుగుతాయి. ఎన్నికలకు మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. తుది ఓటర్ల జాబితాను రెడీ చేయడంతో పాటు ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. సోమవారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన సీఈసీ అధికారులు (CEC Rajiv Kumar).. ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తున్నారు. బుధవారంతో ఈసీ అధికారుల పర్యటన ముగియగా.. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
జనవరి 22న ఓటర్ల తుది జాబితా విడుదల
ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ నెల 22న ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఏపీలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో మహిళా ఓటర్లు 2.07 కోట్ల మంది, పురుష ఓటర్లు 1.99 కోట్ల మంది ఉన్నారు. వందేళ్లు దాటిన వృద్దులు 1,174 మంది ఉన్నట్లు రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఏపీలో మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఉండటం శుభ పరిణామమని, సీనియర్ సిటిజన్లకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. 5.8 లక్షల మందికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశముందన్నారు. 7.88 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారని, ప్రజలందరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపడుతున్నామని, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
కొంతమంది ఏపీ, తెలంగాణలో రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నట్లు ఓ పార్టీ ఫిర్యాదు చేసిందని, పారామిలిటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని ఓ పార్టీ ఫిర్యాదు చేసినట్లు రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల్లో ధనప్రవాహాన్ని కట్టడి చేయాలని కొన్ని పార్టీలు కోరాయని, ఎన్నికల్లో ప్రలోభాలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ఏపీలో లోక్‌సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూస్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నామని, అందులో భాగంగా తొలుత ఏపీను సందర్శించినట్లు స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో అన్ని పార్టీలతో భేటీ అయ్యామని, ఫిర్యాదులు స్వీకరించినట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. రాజకీయ పార్టీల ఫిర్యాదులను పరిష్కరిస్తామని అన్నారు.
ఎన్నికలపై ఈసీ స్పీడ్ పెంచడంతో రాజకీయ పార్టీలు కూడా సమాయత్తం అవుతున్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టింది. సీఎం జగన్ ఇంచార్జ్‌లను మారుస్తూ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. అటు టీడీపీ, జనసేన చేరికలపై దృష్టి పెట్టింది. అధికార వైసీపీలో అసంతృప్తితో ఉన్న నేతలను చేర్చుకోవడంపై ఫోకస్ పెట్టాయి. వైసీపీలో సీటు దక్కని చాలామంది నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అలాగే చంద్రబాబు 'రా.. కదలి రా' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు.