YS Viveka Case : వైఎస్ వివేకా హత్య గురించి ముందుగానే సీఎం జగన్‌కు తెలుసు - కౌంటర్ అఫిడవిట్‌లో హైకోర్టుకు చెప్పిన సీబీఐ !
వైఎస్ వివేకా హత్య గురించి సీఎం జగన్ కు ముందుగానే తెలుసని సీబీఐ హైకోర్టుకు చెప్పింది. హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో సంచలన విషయాలు ఉన్నాయి.
YS Viveka Case : వైఎస్ వివేకా హత్య గురించి బయట ప్రపంచానికి తెలియక ముందే ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలుసని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణలో భాగంగా హైకోర్టుకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్‌లో ఈ అంశాన్ని వివరించారు. వివేక హత్య విషయం సీఎం జగన్ కు ఉదయం 6.15కు ముందే తెలిసినట్టు దర్యాప్తులో తేలిందని.. జగన్ కు అవినాష్ రెడ్డి చెప్పారా అనే విషయంపై దర్యాప్తు చేయాల్సి ఉందని అఫిడవిట్‌లో తెలిపింది. వివేకా మరణం జరిగే కొద్ది గంటల ముందు అవినాష్ రెడ్డి వాట్సప్ చాట్ చేశారన్నారు. 12:27 - 1:10 వరకు వాట్సప్ చాట్ చేసిన అవినాష్ రెడ్డి .. తిరిగి 15 మార్చ్ ఉదయం 4:11 కు వాట్సప్ మెసేజ్ చేశారన్నారు. 1:58 కి అవినాష్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నట్టు గూగుల్ టెక్ అవుట్ చూపించిందన్నారు. అవినాష్ రెడ్డి నీ అరెస్ట్ చేసేందుకే కర్నూల్ విశ్వ భారతి హాస్పిటల్ కు వెళ్ళాము కానీ అక్కడ పెద్ద ఎత్తున అవినాష్ రెడ్డి అనుచరులు హాస్పిటల్ వద్ద ఉండి రోడ్ బ్లాక్ చేశారన్నారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ కోసం కర్నూల్ ఎస్పి సహకారం కూడా కోరామన్నారు. అరెస్టు చేస్తామనే సమాచారంతో హాస్పిటల్ బయట పెద్ద ఎత్తున అవినాష్ అనుచరులు గుమికూడి టెంటు వేసుకొని కూర్చున్నారని. ఆయన ప్రభావిత వ్యక్తి అని సీబీఐ అఫిడవిట్‌లో తెలిపింది.
శుక్రవారం సీబీఐ వాదనలు వినిపించలేదు. అవినాష్ రెడ్డి, సునీత తరపు లాయర్లు వాదనలు వినిపించడంతో సమయం గడిచిపోయింది. శనివారం ఉదయం సీబీఐ తరపు లాయర్లు వాదనలు వినిపించనున్నారు. ఈ సందర్భంగా అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలపై వాదనల్లో కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సీఎం జగన్ తెల్లవారుజామున వివేకానందరెడ్డి హత్య గురించి.. తనతో పాటు సమావేశంలో ఉన్న వారికి చెప్పారన్న ప్రచారం జరిగింది. ఆ నలుగురిలో ఒకరైన మాజీ సీఎస్, ప్రభుత్వ సలహాదారు కల్లాం అజేయరెడ్డి ఇటీవల మీడియా సమావేశం పెట్టారు. తాను సీబీఐకి వాంగ్మూలం ఇచ్చానని చెప్పారు. జగనే తమకు వివేకానందరెడ్డి చనిపోయారని చెప్పారని..అయితే గుండెపోటా కాదా అన్నది మాత్రం చెప్పలేదన్నారు. తమకు ఏ సమయంలో చెప్పారో తెలియదన్నారు.
మరో వైపు ఈ కేసులో జగన్ పీఏ కృష్ణమోహన్ రెడ్డి, భారతి రెడ్డి పీఏ నవీన్ లను గతంలో సీబీఐ ప్రశ్నించింది. అవినాష్ రెడ్డి వీరి ఫోన్లకు కాల్ చేసి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ వైపు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మరో వైపు అవినాష్ రెడ్డి తన తల్లిని హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించి అక్కడే ఉంటున్నారు. ఇలాంటి సమయంలో సీబీఐ వేసిన అనుబంధ అఫిడవిట్ సంచలనం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.
వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నారు.