(Source: ECI/ABP News/ABP Majha)
Vishnuvardhan Reddy: కాణిపాకం ఆలయంలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సత్య ప్రమాణం.. ఎమ్మెల్యే రాచమల్లు ఎక్కడ..?
ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సత్య ప్రమాణాలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కాణిపాకం ఆలయంలో సత్య ప్రమాణం చేశారు.
ఏపీలో గత రెండేళ్లుగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ నేతల మధ్య సత్య ప్రమాణాల రాజకీయం నడుస్తోంది. నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ సత్య ప్రమాణాలకు వెళుతున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మధ్య ఆరోపణలు, పరస్పర విమర్శలు సత్య ప్రమాణం వరకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో సత్యదేవుడి ముందు ప్రమాణానికి తాను సిద్ధమని విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవల పేర్కొన్నారు.
బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మంగళవారం (ఆగస్టు 10న) వేదపండితులు, అధికారులు, బీజేపీ శ్రేణుల మధ్య సత్య ప్రమాణం చేశారు. బాధ్యత గల వ్యక్తిగా 10 రోజుల్లో ప్రమాణం చేస్తానని చెస్తానని చెప్పిన తాను మాట నిలబెట్టుకున్నానని అన్నారు. ఇప్పటివరకూ తాను ఏ ఆశ్రమము, మఠాల నుంచి కూడా డబ్బులు తీసుకోలేదని కాణిపాకం ఆలయంలో సత్యదేవుడు ముందు ప్రమాణం చేశారు. తన జీవితంలో ఏ రకమైన అవినీతికి పాల్పడలేదన్నారు. 23 సంవత్సరాల రాజకీయ జీవితంలో నిజాయితీగా ఉన్నానని సత్య ప్రమాణం చేశారు. తన నిజాయితీని రుజువు చేసుకునేందుకు ప్రమాణం చేస్తానని చెప్పిన ఆయన.. నేడు ఆ మాటను నిలబెట్టుకున్నారు.
‘వేదపండితులు, అధికారులు, బీజేపీ నేతల సమక్షంలో దేవుడు ఆలయంలో ప్రమాణం చేస్తున్నాను. ఈ సత్య ప్రమాణానికి నేను ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి ఆహ్వానం పలికాను. నిజాయితీపరుడిని కనుక నేను చెప్పినట్లుగానే ఆలయానికి వచ్చి ప్రమాణం చేశా. ఎమ్మెల్యే రాచమల్లు మహిళలకు గౌరవం ఇవ్వడు, వారిని అవమానపరిచి మాట్లాడే తరహా వ్యక్తి. కానీ నేను రాచమల్లు ఇంటి మహిళలకు పసుపు కుంకుమ, చీరలు పంపాను. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి పసుపు కుంకుమను నేను ఎన్నడూ వాడుకోలేదు.
రాచమల్లులాగ దిగజారుడు వ్యాఖ్యలు చేసే వ్యక్తిని కాదు. అందుకే కాణిపాకం ఆలయానికి వచ్చాను. ఎమ్మెల్యే రాచమల్లుకు హిందూ ఆలయాల పట్ల నమ్మకం లేకపోవచ్చు. చెప్పిన ప్రకారం నేను ఆలయానికి వచ్చి ప్రమాణం చేశా. కానీ రాచమల్లు మాత్రం ఇక్కడికి రాకుండా పారిపోయాడు. రాచమల్లుతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆ దేవుడు ఇకనైనా మంచి బుద్ధిని ప్రసాదించాలని’ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సత్య ప్రమాణం నేపథ్యంలో కాణిపాకంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మా నేత విష్ణువర్ధన్ రెడ్డి వచ్చారు, అయితే అసత్య ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే రాచమల్లు ఎక్కడా.. అని బీజేపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.
Also Read: MP Raghu Rama: విశాఖలో భూకబ్జాలు...రాష్ట్రంలో రివర్స్ రూలింగ్...ఏపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామ కామెంట్స్