BJP Vishnu : కాలం చెల్లిన పార్టీగా ప్రజలు గుర్తింపు ఇచ్చారు - ఏపీలో కాంగ్రెస్‌కు స్థానం లేదన్న బీజేపీ !
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్‌కు కాలం చెల్లిన పార్టీగా గుర్తింపు ఇచ్చారని బీజేపీ విమర్శించింది. నాలుగు రోజుల పాటు సాగిన భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా రాహుల్ రాసిన లేఖపై విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
BJP Vishnu : ఎన్ని సొబగులు అద్దినా, ఎన్ని మెరుగులు దిద్దినా ఏపీ లో కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదని ఏపీ బీజేపీ స్పష్టం చేసింది కాలం చెల్లిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడో గుర్తింపునిచ్చారని.. కాలం చెల్లిన పార్టీలకు సమాజంలో విలువుండదని పాపం రాహుల్ గాంధీకి తెలియదనుకుంటా అని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీలో భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా జైరామ్ రమేష్.. రాహుల్ గాంధీ రాసిన ఓ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి విష్ణువర్ధన్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
కాలం చెల్లిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడో గుర్తింపునిచ్చారు.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) October 21, 2022
కాలం చెల్లిన పార్టీలకు సమాజంలో విలువుండదని పాపం రాహుల్ గాంధీకి తెలియదనుకుంటా?
ఎన్ని సొబగులు అద్దినా, ఎన్ని మెరుగులు దిద్దినా ఏపీ లో కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదు!!#AndhraRejectedCongress https://t.co/WLxZEDN3al
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 96 కిలో మీటర్లకు పైగా పాదయాత్ర సాగనుంది. ఏపీకి చెందిన కీలక నాయకులతోపాటు.. తెలంగాణ నేతలు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. ఏపీ నుంచి కర్ణాటకకు, ఆ తర్వాత 23న తెలంగాణకు భారత్ జోడో యాత్ర చేరుకోనుంది. కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న టి నాలుగు నియోజకవర్గాలలో ఆంధ్ర రాష్ట్రం నుండి తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక వంటి రాష్ట్రాలకు వలసలు వెళ్లడం వాటి పరిష్కార మార్గాలను అధికారంలోకి రాగానే ఆలోచించే ఆలోచనలో ఉందంటూ పార్టీ నేతలు చెబుతున్నారు. నాలుగు రోజుల పాదయాత్రలో రాహుల్ అనేక హామీలు ఇచ్చారు.
ఏపీకి ఒకటే రాజధాని.. అదే అమరావతి అని తేల్చి చెప్పారు. మూాడు రాజధానుల నిర్ణయం సరైనది కాదన్నారు. మంగళవారం కూడా ఇదే అంశంపై రాహుల్ గాంధీ స్పష్టత ఇచ్చారు. రాహుల్ ను కలిసేందుకు అమరావతి రైతులు కర్నూలు వచ్చారు. వారితో రాహుల్ సమావేశం అయ్యారు. అమరావతికే మద్దతని ప్రకటించారు. అలాగే తాము అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టుని పూర్తిచేస్తాం.. పోలవరం వల్ల వచ్చే ప్రయోజనాలను రైతులకు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో పార్టీలు రాజకీయాలను బిజినెస్ లా చూస్తున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏపీలో రైతులు, కార్మికుల హక్కులు కాపాడతామన్నారు.
అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. లీడర్లే కాదు క్యాడర్ కూడా లేరు. అందుకే రాహుల్ గాంధీ జోడో యాత్రను కేవలం నాలుగు రోజులకే పరిమితం చేశారు. ఎక్కువ సమయం పాదయాత్ర చేయడం వల్ల ఉపయోగం ఉండదని అందుకే యాత్ర ను పరిమితం చేశారని అంటున్నారు. బీజేపీ నేతలు కూడా చెబుతున్నారు. రాహుల్ గాంధీ తన పాదయాత్రలో చాలా పెద్ద హామీలే ఇచ్చారని .. ఏపీలో కనీసం డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని మరెలా గెలుస్తారని ప్రశ్నిస్తున్నారు.