Ayyanna No Jail : సీఐడీకి షాక్ -అయ్యన్న రిమాండ్ తిరస్కరించిన విశాఖ కోర్టు - బెయిల్ మంజూరు!
అయ్యన్న పాత్రుడికి ఊరట లభించింది. రిమాండ్ విధించేందుకు విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తిరస్కరించారు.
Ayyanna No Jail : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకు రిమాండ్ విధించేందుకు విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు మెజిస్ట్రేట్ తిరస్కరించారు. అరెస్టు చేసిన అయ్యన్న పాత్రుడుతో పాటు ఆయన కుమారుడు రాజేశ్‌కు సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు ఇచ్చి విచారించాలని ఆదేశించింది. దీంతో అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌లకు ఊరట లభించినట్లయింది. దాదాపుగా రెండు వందల మంది పోలీసులతో తెల్లవారు జామును ఆయన ఇంటిపైకి వెళ్లి అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులకు షాక్ తగిలినట్లయింది. అయ్యన్న ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీని కేసు డెయిరీ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే సీఐడీ ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో .. రిమాండ్‌కు తరలించేంత ఆధారాలు లేవని గుర్తించిన న్యాయమూర్తి సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేయాలని చెప్పి.. రిమాండ్‌ను తిరస్కరించింది.
అయ్యన్న ఆయన కుమారులపై ఫోర్జరీ కేసు !
ఎన్‌వోసీ ఫోర్జరీ చేశారనే అభియోగాలతో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడును అరెస్ట్ చేసినట్లు సీఐడీ ప్రకటించింది. తమది కాని 2 సెంట్ల భూమిని అయ్యన్నపాత్రుడు ఆక్రమించారని తెలిపారు. ఈ కేసులో అయ్యన్నను A1 గా, ఆయన కుమారులు విజయ్ A2, రాజేశ్ A3 గా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని తెలిపింది. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్నారు. ఫోర్జరీ చేయడం మామూలు విషయం కాదన్నారు. ఐపీసీ 464, 467, 471, 474, రెడ్ విత్ 120-B, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు. అయ్యన్న పాత్రుడుకు రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి ఆధారాలు తారుమారు చేస్తారు అని ... తెల్లవారు జామున 4 గంటలకు అరెస్ట్ చేశామని సీఐడీ తెలిపింది. అయ్యన్నపాత్రుడు పై ఫిర్యాదు చేసిన వ్యక్తి మాములు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సీఐడీకి ఫిర్యాదు చేశాడు కాబట్టి మేం అరెస్ట్ చేశామని తెలిపారు.
శుక్రవారం ఉదయం హైకోర్టులో విచారణ
మరో వైపు అయ్యన్న అరెస్టుపై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. తెల్లవారుజామున సీఐడీ అధికారులు ఆయనను ఇంట్లో అరెస్ట్ చేశారు. అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు చింతకాయల రాజేష్‌ను కూడా అరెస్ట్ చేశారు. అక్రమంగా అరెస్ట్ చేశారని.. నిబంధనలు పాటించలేదని అయ్యన్న తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో విచారణకు హైకోర్టు అంగీకరించింది. అయ్యన్నపాత్రుడుని ఉద్దేసపూర్వకంగా జైల్లో పెట్టాలని అరెస్ట్ చేసినందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని యాయన తరపు న్యాయవాదులు కోరారు. అయితే కేసు డైరీని చూసి నిర్ణయం తీసుకుంటామని.. కేసు డైరీని సమర్పించాలని సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఉదయం పదిన్నరకల్లా కేసు డైరీ సమర్పించాలని న్యాయమూర్తి సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు.
అయ్యన్నను అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. చంద్రబాబునాయుడు సీఐడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.