(Source: ECI/ABP News/ABP Majha)
Tungabhadra Dam Gate: తెగిపోయిన తుంగభద్ర డ్యామ్ గేట్ వైరు, వృథాగా పోతున్న వరద నీరు
Telugu News: 1953 నుంచి నీటిని నిలువ ఉంచుతున్న ఈ డ్యాంలో ఇలాంటి ప్రమాదం జరగటం ఇదే మొదటిసారి. గేట్ చైన్ తెగటం వలన ముంపు ప్రమాదం ఏమి లేదు కానీ నీళ్లు నదిలోకి వెళ్తున్నాయి.
Tungabhadra Dam News: కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతోంది. అర్ధరాత్రి తుంగభద్ర డ్యాం 19వ గేట్ చైన్ వైర్ తెగిపోయింది. దీంతో అనుకున్న స్థాయికి మించి దాదాపు 35,000 క్యూసెక్కుల నీరు నదిలోకి ఎక్కువగా విడుదలవుతుంది. తుంగభద్ర డ్యామ్ కు మొత్తం 33 గేట్ లు ఉన్నాయి. 1953 నుంచి నీటిని నిలువ ఉంచుతున్న ఈ డ్యాంలో ఇలాంటి ప్రమాదం జరగటం ఇదే మొదటిసారి. గేట్ చైన్ తెగటం వలన ముంపు ప్రమాదం ఏమి లేదు కానీ నీళ్లు నదిలోకి వెళ్తున్నాయి. ఇలా డ్యామ్ గెట్ తెగిపోతే తాత్కాలికంగా "Stop Lock" గేట్ పెడతారు. స్టాప్ లాక్ గెట్ అంటే ఇనుప డోర్ లాంటిది. కింద నుంచి సెగ్మెంట్ లు పైకి పేర్చుకుంటూ వస్తారు.
తుంగభద్ర డ్యాం స్టోరేజి కెపాసిటీ 105 టీఎంసీలు. ప్రస్తుతం డ్యాం పూర్తి స్టోరేజీతో నిండుకుండలా ఉంది. Stop Lock గేట్ పెట్టాలి అంటే నీటి లెవెల్ తగ్గాలి, కచ్చితమైన లెక్క లేదు కానీ కనీసం 30 టీఎంసీల కన్నా దిగువకు వస్తే కానీ Stop Lock పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. తుంగభద్ర నుంచి వచ్చే నీరు కర్నూల్ జిల్లా సుంకేసుల బ్యారేజి దాటి అలంపూర్ వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. తుంగభద్ర మీద సుంకేసుల వద్ద కేసి కెనాల్ మొదలవుతుంది. బనకచెర్ల వద్ద తెలుగు గంగ, నిప్పులవాగు ఎస్కెప్ ఛానల్, SRBC, GNSS లతోపాటు కేసీ కెనాల్ లకు కూడా దాదాపు పూరి సామర్ధ్యంతో నీళ్లు వదులుతున్నారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ కూడా దాదాపు పూర్తి కెపాసిటీతో ఉన్నాయి. ఒక్క పులిచింతల మాత్రం 10 టీఎంసీ కుషన్ ఉంది. తుంగభద్ర నుంచి కనీసం 30 నుంచి 40 టీఎంసీల నీరు వచ్చే అవకాశముంది. కాబట్టి, అన్ని కాలువలకు ఫుల్ కెపాసిటీ తో నీళ్లు వదలాలి. తుంగభద్రా డ్యాం నుంచి మొదలయ్యే HLC & LLC కాలువల కింది అనంతపురం, పశ్చిమ కర్నూల్ రైతులకు ఈ ప్రమాదంతో నష్టం జరుగుతుంది. మల్యాల వద్ద ఉన్న హంద్రీ-నీవా లిఫ్ట్ ను పూర్తి కెపాసిటితో ఆపరేట్ చేసి జీడిపల్లి, గొల్లపల్లి డ్యాములు నింపే ప్రయత్నం చెయ్యాలి ప్రమాద తీవ్రత తగ్గి అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
స్పందించిన మంత్రి పయ్యావుల కేశవ్
తుంగభద్ర జలాశయం లోని 19వ గెట్ వైర్ తెగిపోవడంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. అనంతపురం కర్నూలు జిల్లాలకు గుండెకాయ లాంటి తుంగభద్ర జలాశయంలో ఇలాంటి ప్రమాదం జరగటం రైతులకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. డ్యాం కు సంబంధించి ఎంతో అనుభవం ఉన్న రిటైర్డ్ అధికారులతోనూ ప్రస్తుత అధికారులతోనూ చర్చించినట్లు తెలిపారు. వెంటనే నీరు వృథాగా నదిలోకిపోకుండా అవసరమైన చర్యలన్నిటిని త్వరగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఆదేశించిందని వెల్లడించారు. పురాతన డ్యామ్ కావడంతో లాక్ సిస్టం కూడా వేయడం కష్టంగా ఉందని అన్నారు.