Nara Lokesh US Tour: శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ, ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
Andhra Pradesh News | ఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అందుకు ప్రభుత్వ సహకారాన్ని శాన్ ఫ్రాన్సిస్కోలో వివరించారు.

AP Minister Nara Lokesh US Tour | శాన్ ఫ్రాన్సిస్కో: అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో సరికొత్త టెక్నాలజీ వినియోగంపై ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence) అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి సాధించబోతోందని మంత్రి లోకేష్ అన్నారు. వై2కె బూమ్ నేపథ్యంలో బెంగుళూరు, హైదరాబాద్ నగరాల్లో ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు వివరించిన మంత్రి నారా లోకేష్
ఏపీ మంత్రి నారా లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ప్రముఖ పారిశ్రామివేత్త ప్రవీణ్ అక్కిరాజు నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అనుకూలతలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను పారిశ్రామికవేత్తలకు నారా లోకేష్ వివరించారు. ‘భారత్ లో వచ్చే 25 ఏళ్లలో పలు రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అందుకే ఏపీ ప్రభుత్వం పరిపాలనలో ఎఐ (AI) వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలను అందించేందుకు కృషి చేస్తున్నాం. నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నేతృత్వంలో యువనాయకత్వం చురుగ్గా పనిచేస్తోంది. ఏపీ కేబినెట్ లో సైతం 17 మంది కొత్తవారే ఉన్నారంటే చంద్రబాబు విజన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
నవ్యాంధ్రప్రదేశ్ లో రెన్యువబుల్ ఎనర్జీ, బయో ఎనర్జీ, మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఆక్వా, పెట్రో కెమికల్ రంగాల్లో పెట్టుబడులకు భారీగా అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికాభివృద్ధి ద్వారా పేదరిక నిర్మూలనకు సీఎం చంద్రబాబు సరికొత్త పి-4 విధానానికి శ్రీకారం చుట్టారు. ఏపీ సమగ్రాభివృద్ధికి ప్రతి 100 రోజులకు టార్గెట్స్ నిర్దేశించుకొని పరిపాలన చేస్తున్నామని’ శాన్ ఫ్రాన్సిస్కోలో వ్యాపారవేత్తలకు మంత్రి నారా లోకేష్ వివరించారు.
ప్రముఖ పారిశ్రామివేత్త ప్రవీణ్ అక్కిరాజు నేతృత్వంలోని సమావేశంలో ఎన్ విడియా వైస్ ప్రెసిడెంట్ రామ అక్కిరాజు, న్యూటానిక్స్ ప్రెసిడెంట్ రాజీవ్ రామస్వామి, దేవ్ రేవ్ సిఇఓ ధీరజ్ పాండే, విప్రో ప్రెసిడెంట్ నాగేంద్ర బండారు, నెక్సస్ వెంచర్స్ ఎండి జిష్ణు భట్టాచార్య, సిస్కో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవిచంద్ర, గ్లీన్ సంస్థ సిఇఓ అరవింద్ జైన్, సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేని, మిహిరా ఎఐ సిఇఓ రాజా కోడూరి, స్పాన్ ఐఓ సిఇఓ ఆర్చ్ రావు, హిటాచీ వంటారా సిఓఓ ఆశిష్ భరత్, ఇవాంటి చీఫ్ ప్రొడక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ ముక్కామల, గూగుల్ క్లౌడ్ జనరల్ మేనేజర్ సుని పొట్టి, ఈక్వెనిక్స్ గ్లోబల్ ఎండి కెజె జోషి, త్రీడి గ్లాస్ సొల్యూషన్ సిఇఓ బాబు మండవ, వెస్ట్రన్ డిజిటల్ సిఐఓ శేషు తిరుమల, పారిశ్రామికవేత్తలు వంశీ బొప్పన, సతీష్ మంత్రి ప్రగడ, రాజీవ్ ప్రతాప్, సతీష్ తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

