AP High Court : సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారం, హైకోర్టు కీలక వ్యాఖ్యలు
AP High Court : ప్రభుత్వ సలహాదారుల నియామకంపై హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారమని కోర్టు వ్యాఖ్యానించింది.
AP High Court : ఏపీ ప్రభుత్వ సలహాదారులపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్, దేవాదాయశాఖ సలహాదారు శ్రీకాంత్ నియామకంపై దాఖలైన పిటిషన్ లపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ... ఆయా శాఖలపై నిష్ణాతులైన వారినే సలహాదారులుగా నియమిస్తున్నామని వాదనలు వినిపించారు. ఏదైనా అంశంలో తుది నిర్ణయానికి ముందు ప్రభుత్వం సలహాదారుల అభిప్రాయం తీసుకుంటుందన్నారు. అయితే ఈ పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు ఉద్యోగుల టీఏ, డీఏ కోసం మరో సలహాదారుడిని నియమిస్తారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారమని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
గత విచారణలో హైకోర్టు వ్యాఖ్యలు
సలహాదారుల నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గత విచారణలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎం, మంత్రులకు, ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమించడాన్ని ఒకేలా చూడలేమని చెప్పింది. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో కలెక్టర్, పోలీసు కమిషనర్, తహసీల్దార్లకు కూడా సలహాదారులను నియమించుకునే ప్రమాదం ఉందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. సలహాదారుల నియామకానికి అసలు అంతు అనేది ఉందా అని ప్రశ్నించింది. ఈ నియామకాలు రాజ్యాంగ బద్ధమో కాదో తేలుస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలేంటో తేలుస్తామంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఎంత మంది సలహాదారులు ఉన్నారో, ప్రభుత్వ శాఖల వారీగా ఎంత మందిని నియమించారు, ఈ విషయంలో విధివిధానాలు ఏంటో పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్. శ్రీరామ్ ఇప్పటికే ఆదేశించింది.
సలహాదారుల నియామకం చిన్న విషయం కాదు
పీఠాధిపతులు ఉన్నది ప్రభుత్వాలను నడపడానికి కాదని, వారు దేవాలయాల వ్యవహారాలకే పరిమితం కావడం ఉత్తమం అని కోర్టు వెల్లడించింది. సలహాదారుల నియామకం చిన్న విషయం కాదని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం గత విచారణలో ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగుల సలహాదారుగా చంద్రశేఖర్ రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను, దేవాదాయశాఖ సలహాదారు శ్రీకాంత్ పిటిషన్ తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. శ్రీకాంత్ ను దేవాదాయ శాఖకు సలహాదారుగా నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం జీవో 630ని జారీ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధికార ప్రతినిధి హెచ్.కె రాజశేఖర్ రావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఇద్దరు అధికారులకు జైలు శిక్ష
ఇద్దరు జిల్లా పంచాయతీ అధికారులకు కోర్టు ధిక్కార కేసులో ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. గతంలో కర్నూలు జిల్లా డీపీవోగా పనిచేసి, ప్రస్తుతం అనంతపురంలో ఉన్న ప్రభాకర్ రావుకు కోర్టు వారం రోజులు జైలు శిక్ష, రూ.2 వేలు ఫైన్ విధించింది. మరో కేసులో చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారి దశరథ రామిరెడ్డికి 15 రోజులు జైలు శిక్ష, రూ.2 వేల ఫైన్ విధించింది. అయితే తీర్పు అమలును వారం రోజుల పాటు నిలిపివేసింది. అధికారులకు అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఇచ్చింది. జలవనరుల శాఖ స్థలంలో గ్రామ సచివాలయం నిర్మాణంపై గతంలో హైకోర్టు స్టే విధించింది. స్టే ఉన్నప్పటికీ అప్పటి కర్నూలు జిల్లా డీపీవో ప్రభాకర్ రావు, సర్పంచ్ చెక్ పవర్‌ను సస్పెండ్ చేసి ఈవో ఆర్‌డీ ద్వారా చెల్లింపులు చేశారన్న ఆరోపణలు రావడంతో కోర్టు సూమోటోగా కేసు నమోదు చేసి, అధికారులకు శిక్ష విధించింది.