Highcourt On Ayyanna House : అయ్యన్న గోడ కట్టుకోవచ్చు - పర్మిషన్ ఇచ్చిన హైకోర్టు !
అయ్యన్న పాత్రుడు ఇంటి గోడను కట్టుకోవచ్చని హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. అన్ని పర్మిషన్లు ఉన్నాయని డాక్యుమెంట్లను అయ్యన్న తరపు లాయర్లు హైకోర్టుకు సమర్పించారు.
Highcourt On Ayyanna House : అధికారులు కూల్చివేసిన గోడను కట్టుకోవచ్చని అయ్యన్న పాత్రుడు కుమారులకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పంట కాలువను ఆక్రమించి గోడ కట్టాలంటూ అర్థరాత్రి పూట జేసీబీలతో అయ్యన్న ఇంటి గోడను కూలగొట్టారు. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తర్వాతి రోజు హైకోర్టులో అయ్యన్న కుమారుడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు కూల్చివేతలు నిలిపివేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అర్థరాత్రి కూల్చివేతలు చట్ట విరుద్దమని స్పష్టం చేసింది. ఆ పిటిషన్‌పై బుధవారం విచారణ కొనసాగించారు.
అన్నీ అనుమతులు ఉన్నా కూల్చేశారని పిటిషన్
నర్సీపట్నం పురపాలక సంఘం, జలవనరుల శాఖ అనుమతి ఇచ్చినా.. గోడ కూల్చివేశారని అయ్యన్నపాత్రుడి తరుపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. అర్ధరాత్రి సమయంలో గోడ కూల్చి వేశారని ఆధారాలు చూపారు. కాగా జాయింట్ సర్వేకు అయ్యన్న కుమారులు దరఖాస్తు చేశారని ప్రభుత్వ న్యాయవాదులు చెప్పారు. ప్రభుత్వం తరుపు న్యాయవాది, అయ్యన్న పాత్రుడి న్యాయవాది వాదనలు అనంతరం గోడ నిర్మించుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అక్రమంగా గోడ కూల్చి వేయడంతో పిటీషన్ వేయాలని హైకోర్టు అయ్యన్న తరపు న్యాయవాదులను ఆదేశించింది. దీనిపై తగిన ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది.
అనుమతి పత్రాలను హైకోర్టుకు సమర్పించిన అయ్యన్న లాయర్
మున్సిపల్ కమిషనర్ నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మించామని అయ్యన్న కుటుంబసభ్యులు చెబుతున్నారు. ల్యాండ్ పర్మిషన్ ఇచ్చాకే కట్టామన్నారు. అధికారులు మాత్రం ఆక్రమణలో ఉన్నందునే కూల్చివేశామని చెబుతున్నారు. ప్రభుత్వ భూమిలో రెండు సెంట్లు ఆక్రమించారంటూ మున్సిపల్ కమిషనర్ పేరిట ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. ఆ నోటీసులో ఈ నెల 2 వ తేదీ అని ఉండగా .. అది తమకు శనివారం అందజేసి ,ఆదివారం కూల్చివేత మొదలు పెట్టారని అయ్యన్న కుమారుడు రాజేశ్ ఆరోపించారు.
రీసర్వే చేయించాలని అయ్యన్న కుమారులు కోరారన్న ప్రభుత్వ లాయర్
మళ్ళీ రీ సర్వే చెయ్యాలని ఒకవేళ రెండు సెంట్లు ఆక్రమించుకున్నట్టు రుజువైతే.. తామే ఇంటిని కూల్చివేస్తామని ఆయన తెలిపారు. అలాకాకుండా, తమ ఇల్లు సక్రమంగా నిర్మించినట్టు రుజువైతే పడగొట్టిన ఇంటి ప్రహరీని కట్టించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దాంతో అయ్యన్న ఇంటి కూల్చివేత కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. ఇప్పుడు ఆ గోడను కట్టుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే జాయింట్ సర్వేపై ప్రభుత్వం ఏమీ తేల్చలేదు.