NO Highcourt In Kurnool : కర్నూలు కాదు అమరావతిలోనే హైకోర్టు - సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన ఏపీ సర్కార్ ! మనసు మార్చుకుందా ?
అమరావతిలోనే ఏపీ హైకోర్టు ఉంటుందని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ పరిణామం రాజకీయంగానూ చర్చనీయాంశం అవుతోంది.
NO Highcourt In Kurnool : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు పెట్టాలనుకుంటోందనేది బహిరంగరహస్యం. ఈ విషయాన్ని సీఎం జగన్ స్వయంగా పలుమార్లు ప్రకటించారు. మూడు రాజధానుల్లో న్యాయరాజధాని అని కర్నూలును ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు కర్నూలులో హైకోర్టు అనే ప్రతిపాదన గతంలోనిదని.. ఇప్పుడు అలాంటి ఆలోచన లేదని నేరుగా సుప్రీంకోర్టుకు చెప్పడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో హైకోర్టు అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది.
కర్నూలు హైకోర్టు నిర్ణయం గతంలోనిదని.. ఇప్పుడు హైకోర్టు అమరావతిలోనే ఉంటుందన్న కేకే వేణుగోపాల్
విచారణలో అమరావతిలో హైకోర్టు ఏర్పాటు కోసం చాలా పెట్టుబడి పెట్టారు...ఇప్పుడు కర్నూలు లో పెట్టాలని ఎందుకు ప్రతిపాదిస్తున్నారన్న సుప్రీం ధర్మాసనం ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదుల్ని ప్రశ్నించింది. అదంతా ముగిసిపోయింది… కర్నూలులో పెట్టాలన్న ప్రతిపాదన ఇప్పుడేమీ లేదన్న ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ ధర్మాసనానికి స్పష్టం చేశారు. అమరావతిలోనే హైకోర్టు ఉండాలని హైకోర్టు చెప్పిందన్నారు. హైకోర్టు ఎక్కడ ఉండాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుందని ఈ సందర్భంగా ధర్మాసనం వేణుగోపాల్‌ను ప్రశ్నింది. ప్రభుత్వం కూడా అమరావతిలోనే ఉండాలని కోరుకుంటున్నదని.. ఏపీ తరపు న్యాయవాది కెకె వేణుగోపాల్ స్పష్టంగా చెప్పారు.
ప్రభుత్వ లాయర్ వాదనలు వ్యూహాత్మకమా ? ప్రభుత్వం మనసు మార్చుకుందా ?
ప్రభుత్వం తరపు లాయర్ కేకే వేణుగోపాల్ వాదనలు ఇప్పుడు రాయలసీమలోనూ చర్చనీయాంశమవుతున్నాయి. ప్రభుత్వం మూడు రాజధానులను ప్రతిపాదించింది. కర్నూలులో న్యాయ రాజధాని ఉంటుందని చెబుతోంది. అయితే ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు విషయంలో వెనక్కి తగ్గిందా.. మనసు మార్చుకుందా అన్న చర్చ జరుగుతోంది. కర్నూలు హైకోర్టు విషయంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ నాయకులే దగ్గరుండి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కర్నూలుకు హైకోర్టు రావడం వల్ల రాయలసీమ అభివృద్ధి చెందుతుందని వాదిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ప్రభుత్వమే సుప్రీంకోర్టులో.. అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని చెప్పడం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందన్న సందేహం రావడానికి కారణం అవుతోంది.
న్యాయరాజధాని ప్రతిపాదనను ఏపీ సర్కార్ వెనక్కి తీసుకుందా ?
హైకోర్టును కర్నూలుకు తరలించాలంటే.. చట్టాలతో పని లేదు. ప్రభుత్వమే ప్రోసీడ్ కావొచ్చు. హైకోర్టు ద్వారా ప్రతిపాదన పంపాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వం ఎలాంటి ప్రక్రియ ప్రారంభించలేదు. పైగా నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లుగా వాదనలు వినిపించడంతో సమస్య మరింత జఠిలంగా మారనుంది. ఈ అంశంపై ఇంకా ప్రభుత్వ వర్గాలు అధికారికంగా స్పందించలేదు. సుప్రీంకోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది కేకే వేణుగోపాల్ వాదనల్లో ఏమైనా పొరపాటు ఉందా లేకపోతే.. వ్యూహాత్మకంగానే అలా వాదించారా అన్నది తెలియాల్సి ఉంది.
నేను విభజనకు వ్యతిరేకం కాదు, నిబంధనల ప్రకారం విభజన జరగలేదు - ఉండవల్లి