YS Jagan : ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకూ ఉచిత చికిత్స - ఏపీ సీఎం జగన్ నిర్ణయం !
Andhra Arogyashri : ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రూ. 25 లక్షల వరకూ ఉచిత చికిత్స లభిస్తుంది.
Andhra Arogyashri : వైయస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ అంశంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. ఆంధ్రప్రదేశ్‌లో ఇది చరిత్రాత్మక నిర్ణయమన్నారు ఆరోగ్యం, విద్య అన్నవి ప్రజలకు ఒక హక్కుగా లభించాలన్నారు. అందుకనే అధికారంలోకి వచ్చిన రోజునుంచే ప్రభుత్వం ఈ అంశాలపై విశేష కృషి చేసిందని తెిలపారు. ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స కార్యక్రమాన్ని చేపట్టామని... ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ.25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇవ్వాల్సి ఉందన్నారు.
ఆరోగ్య శ్రీ కార్డు ఉందంటే.. ఆ వ్యక్తికి రూ.25 లక్షలు వరకూ వైద్యం ఉచితంగా లభిస్తుందని జగన్ తెలిపారు. ఎవరికి ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుందన్నారు. చికిత్స చేయించుకున్న వారికి మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకునేందుకు రవాణా ఛార్జీల కింద రూ.300 చెల్లించాలని సీఎం ఆదేశించారు. ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో రోగులుగా గుర్తించిన వారికి ఆస్పత్రులకు వెళ్లేందుకు రూ.500లు ఇవ్వాలన్నారు. ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అన్నదానిపై రూపొందించిన వీడియోను అందరికీ పంపించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే స్పెషలిస్టు డాక్టర్లకు అవసరమైన చోట క్వార్టర్లను నిర్మించాలని సీఎం ఆదేశించారు.
18న వైయస్సార్‌ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ వైద్యం ఉచితం కార్యక్రమం ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభమవుతుంది. 19న ప్రతి నియోజకవర్గంలో 5 గ్రామాల చొప్పున జరిగే కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొంటారు. మండలంలో వారానికి నాలుగు గ్రామాల చొప్పున కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతి ఇంటికీ ఆరోగ్యశ్రీకార్డుల పంపిణీ జరుగుతుంది. జనవరి నెలాఖరు నాటికి పూర్తి కానున్న కార్డుల పంపిణీ పూర్తవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలో అవగాహన పెంచేందుకు ఆరోగ్య శ్రీ యాప్‌ను డౌన్లోడ్ చేస్తారు. పనిలోపనిగా దిశయాప్‌ను కూడా డౌన్లోడ్ చేస్తారు. భావసారూప్యత ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, ఉత్సాహవంతులు ఇందులో పాల్గొంటారని సీఎం తెలిపారు. వైయస్సార్ ఆరోగ్య శ్రీని ఎలా వినియోంచుకోవాలన్న దానిపైనే కాకుండా ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నవారికి చేయూత నివ్వడం, అలాగే ఆరోగ్య సురక్ష కార్యక్రమం, చికిత్స పొందుతున్న వారికి సకాలంలో మందులు ఇవ్వడం లాంటి అంశాలపైనా ఈ కార్యక్రమంలో భాగంగా దృష్టిపెడతారని తెలిపారు.
ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు అందుతున్న వైద్య సేవలు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అందించాలని సీఎం ఆదేశించారు. డయాలసిస్ పేషెంట్లు (సీకేడీ) వాడుతున్న మందులు విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మార్కాపురంలో కూడా పలాస తరహా వైద్య చికిత్సా సౌకర్యాలు అందుబాటులోకి రావాలని స్పష్టం చేశారు.