AP Transgenders Policy : ట్రాన్స్ జెండర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గుర్తింపు కార్డులతో పాటు ప్రత్యేక పాలసీ అమల్లోకి!
AP Transgenders Policy : ఏపీలో హిజ్రాల కోసం రాష్ట్రప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ పాలసీని అమలులోకి తెచ్చింది. ఇప్పటికే హిజ్రాలకు నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తుంది ప్రభుత్వం.
AP Transgenders Policy : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక పాలసీ అమల్లోకి తెచ్చింది. ఈ పాలసీలో ట్రాన్స్ జెండర్లకు వైద్యం, విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేయనుంది. ట్రాన్స్ జెండర్లకు సామాజిక భద్రత కల్పించేందుకు పాలసీని అమలు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులు జారీ చేయనుంది. అదేవిధంగా వారి కోసం బడ్జెట్‌లో రూ. 2 కోట్ల నిధులు కేటాయించింది. నవరత్నాల సంక్షేమ పథకాల్లో వీరికి స్థానం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతోపాటు ప్రత్యేకంగా మరికొన్ని చర్యలు చేపట్టనుంది. ట్రాన్స్ జెండర్లు నివసించే ప్రాంతాల్లో మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించనుంది. వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపరచనుంది.
నవరత్నాలతో ట్రాన్స్ జెండర్లకు లబ్ది
నవరత్నాల సంక్షేమ పథకాల్లో ట్రాన్ జెండర్లు లబ్ధి చేకూరిందని ప్రభుత్వం ప్రకటించింది. వైఎస్ఆర్ పింఛన్ కానుక ద్వారా 2207 మంది ట్రాన్స్ జెండర్లకు లబ్దిచేకూరిందని తెలిపింది. 1683 మంది హిజ్రాలకు గుర్తింపు కార్డులు ఇచ్చినట్లు తెలిపింది. వీరిలో 572 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించగా, 432 మందికి ఇళ్లు నిర్మించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ట్రాన్స్ జెండర్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో 267 మంది లబ్దిపొందుతున్నట్లు పేర్కొంది. అదే విధంగా 137 మంది హిజ్రాలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించినట్టు తెలిపింది. మరో 24 మందికి స్వయం ఉపాధి కల్పించినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.