Annadatha Sukibhava Scheme: ఏపీలో 'అన్నదాత సుఖీభవ'తో ప్రతి రైతుకు రూ.20 వేలు - ఇవి తప్పనిసరి!
Andhrapradesh News: ఏపీలో త్వరలోనే మరో పథకం అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. 'అన్నదాత సుఖీభవ' పథకం కింద ప్రతీ రైతుకు ఏడాదికి రూ.20 వేలు అందించనున్నారు. ఈ పోర్టల్ త్వరలో అందుబాటులోకి రానుంది.
AP Government Annadatha Sukhibhava Scheme: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు నెల రోజులు పూర్తి కావొస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే సూపర్ సిక్స్ పథకాల అమలు సహా పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు ఆకర్షణ వంటి అంశాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే డీఎస్సీ ఉద్యోగాల భర్తీ, పింఛన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల ఏర్పాటు, నైపుణ్య గణన వంటి హామీలు నెరవేర్చారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) అందుకు అనుగుణంగా ఆదేశాలిచ్చారు. జులై 1 నుంచి పెరిగిన పింఛన్ రూ.1000తో పాటు ఏప్రిల్ నుంచి ఎరియర్లతో కలిపి ఒకేసారి రూ.7 వేలను లబ్ధిదారులకు అందించారు. ఇక మిగిలిన హామీల అమలుపైనా ప్రభుత్వం దృష్టి సారించారు.
'అన్నదాత సుఖీభవ'
ఏపీ ప్రభుత్వం (AP Government) రైతుల కోసం 'అన్నదాత సుఖీభవ' పథకం అందుబాటులోకి తీసుకురానుంది. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు అందించిన 'వైఎస్ఆర్ రైతు భరోసా' పథకానికి పేరు మారుస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ప్రతీ రైతుకు ఏడాదికి రూ.20 వేలు అందించనుంది. గత ప్రభుత్వం ప్రతీ రైతుకు సంవత్సరానికి రూ.13,500 చొప్పున ఇచ్చింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6 వేలు కలిపే ఉండేది. కూటమి ప్రభుత్వం ఆ సాయాన్ని రూ.20 వేలకు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, పీఎం కిసాన్ నిధులు రూ.6000 చొప్పున మొత్తాన్ని అన్నదాతలకు అందించనుంది. ఏడాదికి 3 విడతల్లో పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. దీని ప్రకారం రెండు విడతల్లో రూ.5 వేలు, మూడో విడతలో రూ.4 వేలు ఇచ్చే అవకాశం ఉంది. 'అన్నదాత సుఖీభవ' పథకం కోసం త్వరలోనే ఓ పోర్టల్ సైతం అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ఇవి తప్పనిసరి
ఈ పథకం పొందేందుకు అర్హతలపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ.. ప్రభుత్వ వర్గాల అంచనా ఏపీకి చెందిన రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా తెలుస్తోంది. కుటుంబంలో ఒక్కరు మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందే ఛాన్స్ ఉంటుందని సమాచారం. అలాగే, కుటుంబంలో ఎవరూ ట్యాక్స్ చెల్లించేంత ఆర్థిక స్థోమత కలిగి ఉండకూడదు. అలాగే, రైతులు ఆధార్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, భూమి పత్రాలు, ల్యాండ్ పాస్ బుక్, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఈ - మెయిల్ ఐడీ కలిగి ఉండాలని పేర్కొంటున్నారు.
అనంతరం, త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. అందులో వివరాలు నమోదు చేసిన తర్వాత ధ్రువపత్రాలను అప్ లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. అనంతరం దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసి భద్రపరుచుకోవాలి. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలు అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది.