Madanapalle News: మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటన వెనుక భారీ కుట్ర - డీజీపీ కీలక వ్యాఖ్యలు
AP Latest News: మదనపల్లె అగ్ని ప్రమాద ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. చంద్రబాబు ఆదేశాల మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు సోమవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు.
Madanapalle Fire Accident: అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీసును డీజీపీ ద్వారకా తిరుమలరావు సందర్శించిన అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ అగ్ని ప్రమాద ఘటన వెనుక భారీ కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఆ ఘటన యాక్సిడెంట్ కాదని.. ఇన్సిడెంట్ అని పేర్కొన్నారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఆఫీసులో అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోగా.. చంద్రబాబు ఆదేశాల మేరకు ద్వారకా తిరుమలరావు సోమవారం (జూలై 22) ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి (జూలై 21 అర్ధరాత్రి) సుమారు 11.30 గంటలకు మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైర్ ఏర్పడిందని చెప్పారు. ఆ ఘటనను తాము 3 గంటల పాటు పరిశీలించామని.. ప్రాథమిక అంచనా ప్రకారం.. అది యాక్సిడెంట్ కాదు.. ఇన్సిడెంట్‌గా భావిస్తున్నామని చెప్పారు. వివాదాస్పద 22ఏ భూముల రికార్డులు ఉన్న గదిలోనే ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని డీజీపీ చెప్పారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న రికార్డులు ఉన్న గదిలోనే ఆ ప్రమాదం జరగడం చాలా అనుమానాలను కలిగిస్తోందని చెప్పారు.
పైగా ఈ ఘటనకు సంబంధించిన సమాచారం మొదట ఆర్డీవోకు తెలిసిందని.. కానీ, ఆయన కలెక్టర్ కు వెంటనే సమాచారం ఇవ్వాల్సి ఉండగా.. సైలెంట్ గా ఉండిపోయారని అన్నారు. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న సీఐ కూడా.. తన సుపీరియర్స్ అయిన ఎస్పీ, డీఎస్పీలకు సమాచారం ఇవ్వలేదని డీజీపీ చెప్పారు. తద్వారా చాలా అనుమానాలు కలుగుతున్నాయని డీజీపీ అనుమానం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ వ్యవహారంలో రెవెన్యూ, పోలీసు అధికారులు అలసత్వం కనిపిస్తోందని చెప్పారు. వీరు చెబుతున్నట్లుగా సబ్ కలెక్టర్ ఆఫీసులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశమే లేదని చెప్పారు. ఈ ప్రదేశంలో ఎక్కడా వోల్టేజీలో తేడాలు లేవని చెప్పారు. ఇదే విషయాన్ని ఫోరెన్సిక్ వాళ్లు కూడా చెప్పినట్లు డీజీపీ ప్రస్తావించారు.
సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద అగ్గిపుల్లలు
అగ్ని ప్రమాదం జరిగిన సబ్ కలెక్టరేట్ ఆఫీసు వద్ద కిటికీ బయట అగ్గిపుల్లలను కూడా గుర్తించినట్లుగా డీజీపీ తెలిపారు. ఆఫీసు బయట కూడా కొన్ని ఫైల్స్ కాలిపోయినట్లు గుర్తించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజులుగా సాక్ష్యాలను ధ్వంసం చేసే ఘటనలు జరిగాయని.. ఇది కూడా అలాంటి ఘటనేనా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని డీజీపీ చెప్పారు.
10 బృందాలతో టీమ్
ఈ కేసు దర్యాప్తున కోసం తాము 10 పోలీసులు బృందాలను ఏర్పాటు చేశామని డీజీపీ చెప్పారు. ఈ కేసు సీఐడీకి బదిలీ చేసే అంశంపై మంగళవారం లేదా బుధవారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీని వెనక ఉన్న కుట్రను బయటపెడతామని చెప్పారు. దీనిపై ప్రభుత్వమేకాక, పోలీసుల శాఖ కూడా చాలా సీరియస్‌గా పరిగణిస్తుందని చెప్పారు.