CM Jagan Davos Tour : దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనున్న సీఎం జగన్, తేదీలు ఖరారు!
CM Jagan Davos Tour : స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం జగన్ పాల్గొనున్నారు. ఈ నెల 22 నుంచి 26 వరకు సీఎం జగన్ దావోస్ పర్యటించనున్నారు.
CM Jagan Davos Tour : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్విట్జర్లాండ్ లోని దావోస్ లో పర్యటించనున్నారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకూ సీఎం జగన్ దావోస్ పర్యటన ఉంటుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్ నాథ్, ఇతర ఉన్నతాధికారులు సీఎం జగన్ తో పాటు వెళ్లనున్నారు. వందల సంఖ్యలో కంపెనీలు దావోస్ ఎకనామిక్ ఫోరమ్ లో పాల్గొంటున్నాయి. దావోస్ ఎకనామిక్ ఫోరమ్ లో కోవిడ్ ముందు, తర్వాత పరిశ్రమల పరిస్థితిపై చర్చ జరగనుంది. రాబోయే కాలంలో పారిశ్రామిక మార్పులపై చర్చ జరగనుంది. పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశంలో పాల్గొంటుంది. ఎకనమిక్ ఫోరమ్ కంపెనీల పారిశ్రామిక ప్రగతిపై చర్చించే వేదికగా ఉంటుంది. ఈ సమావేశంలో ఏపీ పారిశ్రామిక స్థితిగతులపై చర్చ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ బృందం ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాలను కంపెనీలకు వివరిస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఛైర్మన్ తో సీఎం జగన్ భేటీ కానున్నారు.
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా
సీఎం జగన్ మే 22 నుంచి 26 వరకు దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనున్నారు. దావోస్ పర్యటనలో సీఎం జగన్ మూడు రాష్ట్ర స్థాయి సమావేశాలలో పాల్గొనున్నారు. ఈ నెల 23న వైద్యరంగంపై కీలక సమావేశం, 24న విద్య, నైపుణ్య రంగాలపై అత్యున్నత స్థాయి సమావేశం, 25న డీసెంట్రలైజ్డ్ సమావేశాల్లో పాల్గొనున్నారు. దావోస్ పర్యటనపై మంత్రి అమర్నాధ్ మాట్లాడుతూ వందల సంఖ్యలో కంపెనీలు దావోస్ ఎకనామిక్ ఫారమ్‌లో పాల్గొంటాయి. దావోస్ పర్యటనతో వెంటనే పెట్టుబడులు రావు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక టీంతో ముందుకు వెళ్లి ఏపీకి పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
కోనసీమ జిల్లాలో సీఎం జగన్ టూర్
రేపు(13వ తేదీ)న కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో వైఎస్సార్ మత్య్సకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సీఎం జగన్ శుక్రవారం ఉదయం 9.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.20 గంటలకు ఐ.పోలవరం మండలం కొమరగిరి చేరుకుంటారు. 10.45 గంటలకు మురమళ్ళలో వేదిక వద్దకు చేరుకుని వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం సీఎం జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 12.15 గంటలకు మురమళ్ళ నుంచి బయలుదేరి 1.20 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద 21 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు కలిగిన మత్స్యకారులుగా జీవనోపాధి కొనసాగిస్తున్న వారికి రూ. 10 వేలు ఆర్థిక సాయం అందిస్తుంది. సముద్ర జలాల్లో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కాలంలో ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో వేటను నిషేధిస్తుంది ప్రభుత్వం. దీంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ఈ నగదు ద్వారా జీవన భృతి అందిస్తుంది. ఈ పథకం ద్వారా ఒక్కో మత్య్యకార కుటుంబానికి రూ.10 వేలు ఆర్థికసాయం అందిస్తుంది. దీంతో పాటు మత్స్యకారులకు ప్రభుత్వం డీజిల్ సబ్సిడీని కూడా అందిస్తుంది.