Chandrababu: జగన్ ఫోటో ప్లేస్‌లో ఏపీ రాజముద్ర, కొత్త పాస్ పుస్తకాల జారీకి చంద్రబాబు నిర్ణయం
AP Latest News: ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి ఇవ్వాలని నిర్ణయించారు.
Pattadar Passbooks in AP: ఏపీలో రైతులకు గత ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటోతో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, కూటమి ప్రభుత్వం వాటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని నిర్ణయించింది. పట్టాదారు పాస్ పుస్తకాలపై వ్యక్తుల బొమ్మలు తీసేసి రాజముద్రతో ఇవ్వాలని చంద్రబాబు (Chandrababu Naidu) నిర్ణయించారు. నేడు (జూలై 29) రెవెన్యూ శాఖపై జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రి అనగాని సత్య ప్రసాద్ తో పాటు రెవెన్యూ అధికారులు కూడా పాల్గొన్నారు.
రాజముద్రతో ఉన్న పుస్తకాన్ని రెవెన్యూ అధికారులు ముఖ్యమంత్రికి (Chandrababu Naidu) చూపించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వ్యక్తుల ఆస్తి వివరాలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాక, ఆ ప్రాపర్టీ దగ్గరకు వెళ్లే మ్యాప్ కూడా వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పొలాల సరిహద్దుల వద్ద రాళ్లపైన జగన్ రెడ్డి తన బొమ్మలు వేయించుకున్నారని.. అందుకు రూ.650 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. అయితే, జగన్ చిత్రం ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏం చేయాలని కూడా సమీక్షలో చర్చించారు. ఆ రాళ్లపై జగన్ బొమ్మలు తీసేయాలంటే మరో 15 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. జగన్ బొమ్మల పిచ్చి వల్ల మొత్తంగా 700 కోట్ల వరకు ప్రజా సొమ్ము వృథా అయ్యిందని అన్నారు. అయితే, జగన్ ఫోటో ఉన్న గ్రానైట్ రాళ్లను ఏం చేయొచ్చో.. వాటిని ఎలా ఉపయోగించవచ్చో ఆలోచనలతో రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
హర్షం వ్యక్తం చేసిన మంత్రి
ఏపీలో త్వరలో రాజముద్రతో భూయజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందచేయాలన్న సీఎం చంద్రబాబు నిర్ణయంపై విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. ఆ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి పట్టాదారు పాసుపుస్తకంపై రాజముద్ర వేసి ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకున్నట్లు అయిందని అన్నారు.
దేశంలో ఎప్పుడూ, ఎక్కడా లేని విధంగా జగన్ మోహన్ రెడ్డి పట్టాదారు పాసు పుస్తకాలపై తన బొమ్మను ముద్రించుకున్నారని తెలిపారు. ఇది జగన్ రెడ్డి ప్రచార పిచ్చికి పరాకాష్ట అని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.15 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు. పొలాల సరిహద్దు రాళ్లపై కూడా తన బొమ్మను ముద్రించి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan News) రూ.700 కోట్ల ప్రజాధనం వృధా చేశారని.. ఈ సొమ్మును సరిగ్గా వినియోగించుకుని ఉంటే రాష్ట్రంలోని ఏదో ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేదని వివరించారు. చంద్రబాబు నాయకత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, గతంలో జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పోల్చి చూస్తే ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తుందన్నారు.