Somu Veerraju On Pawan: కొందరికి మోదీ నచ్చుతారు, బీజేపీ నచ్చదు: జనసేనానిపై సోము వీర్రాజు పరోక్ష వ్యాఖ్యలు
కొంత మందికి ప్రధాని నరేంద్ర మోదీ నచ్చుతారు కానీ, బీజేపి నచ్చదంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సొము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
కొంత మందికి ప్రధాని నరేంద్ర మోదీ నచ్చుతారు కానీ, బీజేపి నచ్చదంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సొము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై ఆయన ఇలా వ్యాఖ్యానించారు. గతంలో బీజేపి నేత మాధవ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కలసి ఉన్నాం కాని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం సహకరించలేదన్నారు. కలసి ఉన్నా లేనట్లేనంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సొము వీర్రాజు సైతం ఇదే తరహాలో కామెంట్స్ చేయటం రాజకీయాల్లో చర్చ మెదలైంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన నుంచి సరైన సహకారం లేదంటూ సోము వీర్రాజు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా అభ్యర్థులకు జనసేన నుంచి అందిన సహకారం ఎంత అనేది మీరే ఆలోచించుకోండని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బాగా పని చేస్తారు. ఏపీలో బీజేపీ మాత్రం ఎదగకూడదని అందరూ మాట్లాడుతున్నారని, ఈ వ్యాఖ్యలు ఏ ఒక్కరినో ఉద్దేశించినవి కావని క్లారిటీ ఇచ్చారు. బీజేపీ - జనసేన విడిపోవాలనేది మీ కోరిక, ఓ చిన్న మాట పట్టుకుని ఏదేదో ఊహించేస్తున్నారు. మీ కోరిక ఫలించదన్నారు. వైసీపీ - బీజేపీ కలిసి ఉన్నాయనేది ఓ అపొహేనని, నేను ప్రతి రోజూ వైసీపీని, సీఎం జగన్ పాలన వైఫల్యాలపై విమర్శిస్తూనే ఉన్నానన్నారు. మాధవ్ వ్యాఖ్యలపై ఇంతకు మించి స్పందించనని చెప్పారు.
భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు..
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. వేద పండితులు శివ యజ్న నారాయణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 15 మందికి సోమువీర్రాజు చేతులు మీదుగా సన్మానం చేశారు. విజయవాడ నగరంలో మేళతాళాలతో, బాణా సంచా కాలుస్తూ బీజేపీ కార్యకర్తలు సోము వీర్రాజుకు స్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ నుంచి బీజేపీ లో చేరిన మాజీ కార్పొరేటర్ ఆకుల కిరణ్ కుమార్ కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
జగన్ సర్కార్ పై ఛార్జ్ షీట్...
ఏపీ సీఎం జగన్ ప్రభుత్వంపై ఛార్జిషీటు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అన్ని స్థాయిల్లో పరిశీలన చేసి జగన్ మోసాలను ప్రజలకు వివరిస్తామన్నారు. జగన్, చంద్రబాబు ఇద్దరూ కాంగ్రెస్ లో శిక్షణ పొందిన వారేనన్నారు. హత్యలు, దోపిడీలు చేసే నాయకులు భారతీయ జనతా పార్టిలో లేరని, కేవలం అభివృద్ధి చేసే నరేంద్ర మోదీ లాంటి నేతలు ఉన్నారని పేర్కొన్నారు.
కాశ్మీర్ లో అప్పటి పరిస్థితులు అలా...
కాశ్మీర్ లో పాకిస్థాన్ తీవ్ర వాదులు వచ్చి వారి జెండా ఎగురవేసే పరిస్థితి ఉండేదని ఈ సందర్బంగా సొము వీర్రాజు వ్యాఖ్యానించారు. జమ్ము వెళ్లి 220కి.మీ శ్రీనగర్ కు వెళ్లడం అప్పట్లో చాలా గొప్ప విషయమని అయితే మోదీ ప్రధాని అయ్యాక... మన జాతీయ జెండా రెపరెపలాడించారని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు చేయడం జరిగిందని, దేశంలో విప్లవాత్మకమైన మార్పులకు మాజీ ప్రధాని వాజ్ పేయి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో చేశారని అన్నారు. దేశాభివృద్ధికి, ప్రపంచ దేశాలలో మనం గర్వంగా తల ఎత్తుకునేలా చేశారని కొనియాడారు. ఇంధనాన్ని మనమే తయారు చేసి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నామని, సోలార్ పవర్ ను మనమే అందరికీ అందిస్తామని చెప్పారు. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని తెలిపారు. ఎల్.ఈ.డి బల్బులు, బ్యాటరీ బండ్లను ప్రజలకు ఇచ్చారని గుర్తు చేశారు.
అమరావతే రాజధాని...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేది బీజేపీ మాత్రమేనని అన్నారు. అమరావతిని రాజధాని గా అభివృద్ధి చేస్తూ ప్రధాని మోదీ నిధులు ఇచ్చారని విజయవాడలో మూడు ఫ్లై ఓవర్ లు, ఇబ్రహీంపట్నం వద్ద ఆరు లైన్ల వంతెన నిర్మించామన్నారు. విజయవాడ కేంద్రంగా అన్నివైపులా ఆరు లైన్ల జాతీయ రహదారి వేశామని, డబ్బులు ఇస్తే అభివృద్ధి చేయకుండా మాటలు చెబుతున్నారని విమర్శించారు. ఇక్కడే రాజధాని అనే ఎయిమ్స్ తో పాటు అనేక సదుపాయాలు కల్పించామన్నారు. ఇదే రాజధాని.. అభివృద్ధి, చేస్తా.. ఇల్లు కట్టా అని ఆనాడు చెప్పారని, ఇప్పుడు విశాఖ రాజధాని అని మాట మార్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని జగన్ పాలనపై విమర్శలు చేశారు. ఇక్కడ ఇల్లు కట్టుకుని విశాఖ వెళ్ళడం ఏంటని ప్రశ్నించారు. విశాఖను మీరేంటి అభివృద్ధి చేసేది.. ఇప్పటికే అభివృద్ధి చెందిందని, జగన్ ప్రభుత్వం రెండు వందల కొట్లు కూడా విశాఖ కు ఖర్చు చేయలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లో మోదీ పాత్ర ఎంతో కీలకమని, ప్రపంచ దేశాలకే మోదీ పాలన ఆదర్శగా ఉన్నారని తెలిపారు.