AP Bar Policy: ఏపీ బార్ పాలసీ- లైసెన్స్ ఫీజు, అప్లికేషన్ ఫీజులు భారీగా తగ్గించిన కూటమి ప్రభుత్వం
AP government New BAR policy | ఏపీ ప్రభుత్వం ఇటీవల కొత్త బార్ పాలసీ ప్రకటించింది. బార్ లైసెన్స్ ఫీజులతో పాటు అప్లికేషన్ ఫీజులను భారీగా తగ్గించింది ఏపీ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ.

AP Bar Policy | అమరావతి: కొత్త బార్ పాలసీలో భాగంగా బార్ లైసెన్స్ ఫీజులు, దరఖాస్తు రుసుములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా తగ్గించింది. లైసెన్స్ ఫీజును ఆరు వాయిదాల్లో చెల్లించేందుకు సైతం అవకాశం కల్పించింది. ఈ మార్పులు వల్ల ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటారు. లైసెన్స్ ఫీజు, అప్లికేషన్ ఫీజుల తగ్గింపు వివరాలను ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ (AP Excise Department) కమిషనర్ నిశాంత్ కుమార్ మంగళవారం ప్రకటించారు. తాజాగా జీవో ప్రకారం ఏపీలో మొత్తం 840 బార్లకు లైసెన్సులు జారీ చేస్తారు. 10 శాతం బార్‌లను గీతకులాలకు కేటాయించడంతో పాటు లైసెన్స్ ఫీజులో వారికి 650 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు.
భారీగా తగ్గిన బార్ లైసెన్స్ ఫీజు (AP Bar License Fees)
గతంలో కడపలో బార్ లైసెన్స్ ఫీజు రూ.1.97 కోట్లు వసూలు చేయగా, అనంతపురంలో రూ.1.79 కోట్లు, తిరుపతిలో రూ.1.72 కోట్లు, ఒంగోలులో రూ.1.40 కోట్లు ఉండేది. ఏపీలో కొత్త బార్ పాలసీ విధానం ద్వారా ప్రస్తుతం ఈ నగరాల్లో ఫీజు రూ.55 లక్షలకు తగ్గించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు పట్టణంలో ఫీజు రూ.71 లక్షల నుండి రూ.35 లక్షలకు తగ్గించారు. ప్రభుత్వం జనాభా ఆధారంగా బార్ లైసెన్స్ ఫీజును ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. 50 వేల వరకు జనాభా ఉన్న పట్టణాల్లో ఫీజు రూ.35 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల మధ్య జనాభా ఉన్న పట్టణాల్లో రూ.55 లక్షలు, 5 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో రూ.75 లక్షలుగా నిర్ణయించారు. ఈ రేట్లు రిటైల్ A4 దుకాణాలతో పోలిస్తే సుమారుగా 26 శాతం నుండి 48% వరకు తక్కువ అని ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు.
అప్లికేషన్ ఫీజు తగ్గించిన ఎక్సైజ్ శాఖ
దరఖాస్తు రుసుములో సైతం ఏపీ ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా దరఖాస్తు రుసుము రూ.5 లక్షలుగా నిర్ణయించారు. గత పాలసీలో, రాష్ట్రంలోని 90 శాతం పట్టణ స్థానిక సంస్థల్లో బార్‌లకు రూ.5 లక్షలకుపైగా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు వంటి నగరాల్లోని 362 బార్లకు రూ.10 లక్షల చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించాల్సి వచ్చేది. చీరాల, బాపట్ల, ఒంగోలు, మదనపల్లె వంటి మున్సిపాలిటీల్లోని 399 బార్లకు రూ.7.5 లక్షలుగా రుసుము ఇప్పుడు రూ.5 లక్షలుగా నిర్ణయించినట్లు కమిషనర్ వివరించారు.
కొత్త బార్ పాలసీ ప్రకారం, బార్ లైసెన్సులు ఇకపై బహిరంగ లాటరీ విధానం ద్వారా కేటాయించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని కమిషనర్ నిశాంత్‌కుమార్ తెలిపారు. పూర్తిగా పారదర్శకంగా డ్రా ఆఫ్ లాట్స్ విధానం ద్వారా అన్ని బార్ లైసెన్సులను కేటాయిస్తారు. ప్రతి బార్‌కు కనీసం 4 చెల్లుబాటు అయ్యే దరఖాస్తు ఫారాలు ఉండాలని, తద్వారా పోటీ పెరగడంతో పాటు అడ్డదారుల దరఖాస్తులు తగ్గుతాయని సర్కార్ భావిస్తోంది. తెలంగాణలో బార్‌ల కేటాయింపులో ఒక్కో బార్‌కు 131 దరఖాస్తులు వచ్చాయి. ఇటీవల ఏపీలో రిటైల్ షాప్‌ల కేటాయింపులో ఒక్క మద్యం దుకాణానికి సగటున 26 అప్లికేషన్లు వచ్చాయి.






















