Chandrababu Tour : 35 ఏళ్ల నాటి విషయాన్ని గుర్తుచేసుకున్న చంద్రబాబు, మళ్లీ నల్లారి ఇంటికి!
Chandrababu Tour : అన్నమయ్య జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు నల్లారి కిషోర్ కుమార్ ఇంటికి వెళ్లి అల్పాహారం చేశారు.
Chandrababu Tour : అన్నమయ్య జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లారు. దాదాపు 35 సంవత్సరాల క్రితం మాజీ మంత్రి నల్లారి అమరనాథ రెడ్డి, చంద్రబాబును రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని చంద్రగిరి సీటును కేటాయించారు. అప్పట్లో నల్లారి ఇంటికి వచ్చారు. మళ్లీ ఇవాళ చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా నేడు రెండో రోజు గురువారం అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం నగిరిపల్లి గ్రామంలోని నల్లారి ఇంటికి చేరుకుని ఉదయం టిఫిన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున నగిరిపల్లి చేరుకుని చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.
ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష
అనంతరం కలికిరిలోని ఓ కళ్యాణ మండపంలో రాజంపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ముందుగా పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత వరుసగా రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లి, పుంగనూరు, చివరగా మదనపల్లి నియోజకవర్గం చంద్రబాబు సమీక్షలు జరిపారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సీమ జిల్లాల పర్యటన రెండో రోజు... పీలేరు నియోజకవర్గంలో పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. (1/3)#ChandrannaBharosa #NaraChandrababuNaidu #TDP pic.twitter.com/Lo8UXc8Vxy
— Telugu Desam Party (@JaiTDP) July 7, 2022
రాయలసీమలో మళ్లీ యాక్టివ్
రాయలసీమపై టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ఒకప్పుడు రాయలసీమ జిల్లాల్లో కడప మినహా మిగిలినవి టీడీపీ కంచుకోటలుగా ఉండేవి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో బీసీ ఓటు బ్యాంకు టీడీపీకి మద్దతుగా ఉండేది. 2014 వరకు ఈ పరిస్థితి కొనసాగింది. అయితే ఆ తర్వాత సీన్ మారిపోయింది. 2019 ఎన్నికల్లో అంతా రివర్స్ అయింది. కుప్పం, ఉరవకొండ, హిందూపురం తప్ప మిగిలిన చోట్ల టీడీపీ గల్లంతైంది. 2014 నుంచి బీసీలపై ఫోకస్ పెట్టిన వైసీపీ 2019 నాటికి అనంతపురం, కర్నూలు జిల్లాలను క్లీన్ స్వీప్ చేసింది. దీంతో టీడీపీ కంచుకోటలను వైసీపీ కైవసం చేయడంపై ఆ పార్టీ మళ్లీ ఫోకస్ పెట్టింది. రాయలసీమ జిల్లాలపై చంద్రబాబు దృష్టిపెడుతున్నారు. అదే సమయంలో కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ భారీగానే ప్రయత్నాలు చేస్తుంది. కుప్పంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు భరత్ ను రంగంలోకి దింపుతోంది. దీంతో ఆయన ఏ మేరకు చంద్రబాబుకు పోటీ ఇస్తారన్నది వచ్చే ఎన్నికల్లో వేచిచూడాలి. ఇలాగే ఇటీవల వైసీపీలో గ్రూప్ రాజకీయాల మొదలయ్యాయి. వీటిపై దృష్టిపెట్టిన టీడీపీ రాయలసీమను మళ్లీ కైవసం చేసుకోవాలని స్పీడ్ పెంచింది.