Andhra Pradesh Weather: సెగలు కక్కుతున్న భానుడు- రానున్న రోజుల్లో మరింత మంటలు
Andhra Pradesh Weather: వేసవికాలం ప్రారంభ దశలో ఉంది. భానుడు తీవ్ర రూపం దాల్చుతున్నాడు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఉంటుందని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ వెల్లడించారు.
Andhra Pradesh Weather: ఏడాది వేసవికాలం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. భానుడు మాత్రం తీవ్ర రూపం దాల్చుతున్నాడు. రానున్న రోజుల్లో మరింతగా ఎండ తీవ్రత ఉంటుందని, ఈ మేరకు భారత వాతావరణ శాఖ హెచ్చరించినట్లు విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ వెల్లడించారు. మార్చిలో ఎండలు పెరిగిన నేపథ్యం, ఏప్రిల్ మే నెలలో దాని తీవ్రత పెరిగే అవకాశం తదితర అంశాలతో కూడిన వివరాలను ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సూర్యుడు ఫిబ్రవరి నెల నుంచే సుర్రుమనిపిస్తున్నాడు. రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. క్రమేపి రాష్ట్ర వ్యాప్తంగా పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భానుడి భగభగలకు బయట అడుగు పెట్టేందుకు జనం భయపడుతున్నారు. మార్చి నేల మొదటి వారంలోనే ఎండలో తీవ్రంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలలో ఎండలు తీవ్రతరం అయ్యే ఛాన్స్ ఉందని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ తెలిపారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో ఏప్రిల్, మే నెలలతోపాటు మార్చి నుంచే ఎండలు ప్రభావం చూపుతాయని, దీంతోపాటు ఈసారి వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని కూర్మనాథ్ వెల్లడించారు. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్సార్ కడప జిల్లాల్లో ఎక్కువగా, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
సిద్ధంగా విపత్తు నిర్వహణ సంస్థ
భానుడు తీవ్రత నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ సిద్ధంగా ఉందని కూర్మనాధ్ వెల్లడించారు. విపత్తుల నిర్వహణ సంస్థ తగు చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల ప్రాణనష్టాన్ని తగ్గించగలుగుతుందన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాలపై అధికారులు దృష్టి సారించాలని ఆయన సూచనలు జారీ చేశారు. 2016 నుంచి 2022 వరకు వరుసగా 48.6°C, 47.8°C ,45.6°C, 47.3°C, 47.8°C, 45.9°C, 45.9 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, గతేడాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ లో అత్యధికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వివరించారు. 2016లో 723 , 2017లో 236, 2018లో 8, 2019లో 28 వడగాల్పుల మరణాల నమోదుకాగా విపత్తుల సంస్థ, జిల్లాయంత్రాంగం సమన్వయ చర్యలతో 2020, 21, 22లో వడగాల్పుల మరణాలు అసలు సంభవించలేదని, గత ఏడాది 03 (ప్రకాశం2, చిత్తూరు1) వడగాల్పుల మరణాలు నమోదైనట్టు వివరించారు.
నిరంతర పర్యవేక్షణ
అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులను ఎప్పటికప్పుడు విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఏమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తూ జిల్లా యంత్రాంగానికి రెండు రోజుల ముందుగానే ఉష్ణోగ్రత వివరాలు, వడగాలుల తీవ్రతపై సూచనలు జారీ చేయనున్నారు. రియల్ టైమ్ లో ఎండ తీవ్రత ఉండే మండల అధికారులను అప్రమత్తం చేయనున్నారు. ఎండలతోపాటు క్యుములోనింబస్ మేఘాల వలన ఆకస్మికంగా భారీ వర్షాలు, పిడుగులు పడే చాన్స్ ఉంది. వీటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండల సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే విపత్తుల సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలని కోరుతున్నారు. ప్రజల ఫోన్లకు విపత్తుల సంస్థ నుంచి వడగాల్పుల హెచ్చరిక సందేశాలు జారీ కానున్నాయి.
వీరు జాగ్రత్తలు పాటించాలి..
ఎండ తీవ్రత తిరుగుతున్న నేపథ్యంలో కొన్ని వర్గాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దినసరి కూలీలు ఉదయం పూటే పనులు పూర్తి చేసుకొని మధ్యాహ్నంలోగా ఇంటికి చేరేలా చూసుకోవాలి. మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లాలంటే తప్పకుండా గొడుగులు వెంట తీసుకెళ్లాలి. గర్బిణీలు, బాలింతలు, చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. డీ హైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారు చేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తీసుకోవడం వల్ల ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందవచ్చు. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.
వేడిగాలులతో వడదెబ్బ బారిన పడే ప్రమాదం
ఎండ తీవ్రత పెరిగే కొద్దీ వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత ఎక్కువ మంచి నీటిని, ఇతర పానీయాలను తీసుకోవడం ద్వారా డీహైడ్రేట్ కాకుండా ఉండవచ్చు. తద్వారా వడ దెబ్బకు అవకాశం ఉండదని ఇప్పుడు సూచిస్తున్నారు. సెల్ ఫోన్లకు వడగాల్పుల హెచ్చరిక సందేశాలు వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. రానున్న మూడు నెలల పాటు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎండ తీవ్రత వల్ల కలిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులతోపాటు అధికారులు సూచిస్తున్నారు.