AP Summer News: ఎండలు మండుతున్నాయి, వేడి వేడి సమాచారం కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి
ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో సాధారణం కన్నా గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ ప్రకటించింది.
Tollfree Numbers to know details of Summer Temperature: మార్చి నెల నుంచే భానుడి భగభగలు మొదలయ్యాయి. అంటే ఆల్ మోస్ట్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో సాధారణం కన్నా గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఫిబ్రవరిలోనే ఆరంభం...
ఫిబ్రవరి నుంచే భానుడి భగభగలు ఉండటంతో ఉక్కపోత, వేడిమితో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఫిబ్రవరి చివరి వారంలోనే 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత కర్నూలు జిల్లా కౌతాళంలో నమోదు కాగా, విజయనగరం జిల్లా కొత్తవలసలో కూడా 37.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డైంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి నెల ప్రారంభం కావడంతో ఎండ తాపం కూడా అధికమైంది. మధ్యాహ్నం పూట భానుడు తన ప్రతాపం చూపుతుండడంతో అడుగు బయట పెట్టేందుకు జనం భయపడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలతోపాటు మార్చి నుంచే ఎండలు తీవ్రంగా ఉంటాయని, దీంతోపాటు వడగాడ్పుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించినట్లు డా. బీఆర్ అంబేద్కర్ విపత్తుల సంస్థ ఎండీ తెలిపారు. మార్చి నుంచే ఎండలు ప్రభావం చూపనున్నట్లు పేర్కొన్నారు.
భారత వాతావరణ సంస్థ (ఐఎండి) సూచనల మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ తగు చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాలపై అధికారులు దృష్టి సారించాలని ఆయన సూచించారు.
2017 నుంచి లెక్కలు ఇవే...
2017 నుంచి 2021 వరకు వరుసగా 46.7°C ,43.1°C, 46.4°C, 47.8°C, 45.9 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదుకాగా, గత ఏడాది ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. 2016లో 723 , 2017లో 236, 2018లో 8, 2019లో 28 వడగాల్పుల మరణాల నమోదయ్యాయని, 2020,21,22లో వడగాల్పుల మరణాలు అసలు సంభవించలేదని అంబేద్కర్ స్పష్టం చేశారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల పై ఎప్పటికప్పుడు విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఏమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తూ జిల్లా యంత్రాంగానికి నాలుగు రోజుల ముందుగా ఉష్ణోగ్రత వివరాలు, వడగాలుల తీవ్రత పై సూచనలు జారీ చేయనున్నట్లు చెప్పారు. వేసవి కాలం ఎండలతో పాటు క్యుములోనింబస్ మేఘాల వలన అకాల వర్షాలతో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండలతో పాటుగా ఆకస్మిక భారీవర్షాలు, పిడుగులు కూడా పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఎనీ టైం సమాచారం....
ఉష్ణోగ్రతలపై పూర్తి వివరాల కోసం విపత్తుల సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 18004250101 లను అధికారులు అందుబాటులో ఉంచారు. దినసరి కూలీలు ఉదయం పూటనే పనులు పూర్తి చేసుకొని మధ్యాహ్నంలోగా ఇంటికి చేరేలా చూసుకుంటే మంచిదంటున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచించారు. మధ్యాహ్నం పూట బయటికి వెళ్లాలంటే తప్పకుండా గొడుగులు వెంట తీసుకువెళ్లాలని, గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మనిషి శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.