Pulichintala Dam: పులిచింతల డ్యాం నాణ్యతపై అనుమానాలు... వినియోగంలోకి వచ్చిన ఏడేళ్లకే ఎన్నో సమస్యలు...
వరద ప్రవాహానికి పులిచింతల డ్యాం గేటు కొట్టుకుపోయింది. నీటి వృథాను ఆపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రాజెక్టు భద్రతపై అనేక అనుమానాలు వస్తున్నాయి.
పులిచింతల ప్రాజెక్టు గేటు గురువారం విరిగిపడి, భారీగా నీరు వృథా అయింది. నీరు వృథా కాకుండా స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రాజెక్టు గడ్డర్‌కు అనుసంధానిస్తూ ఏర్పాటు చేసిన సుమారు 250 టన్నుల బరువున్న 16వ నంబరు గేటు ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. గురువారం తెల్లవారు జామున నీటిని దిగువకు వదిలే క్రమంలో ఈ గేటును 4 అడుగుల మేర లేపారు. ఈ సమయంలో వరద ఉద్ధృతికి గేటుపై ఒత్తిడి ఎక్కువై కొట్టుకుపోయింది. పులిచింతల సాగుననీటి ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చిన 7 ఏళ్లకే ఈ ప్రమాదం చోటుచేసుకోవడంపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తు్న్నారు.
గేటు విరిగి పోవడానికి గల కారణం ఏంటో ప్రస్తుతానికి తెలియదని, దీనిపై విచారణకు నిపుణుల కమిటీని నియమిస్తున్నామని ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి అన్నారు. పులిచింతల జలాశయంలో నీటి నిల్వను 10 టీఎంసీల స్థాయికి తగ్గించి, 16వ గేటు నీటి ప్రవాహాన్ని అడ్డుకునేలా స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ పనులు చేపడుతుందని ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి వెల్లడించారు. అలాగే ప్రాజెక్టు పూర్తి పరిస్థితిపైనా పరిశీలన చేపట్టాలని ఏపీ జల వనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
ఈ ప్రాజెక్టులో 44 టీఎంసీలు నిల్వ ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ తలుపు ఉన్న 16వ గేటు వద్ద నిర్మాణ గోడలకు కొంత మేర నష్టం జరిగింది. ఈ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వ 45.77 టీఎంసీలు కాగా ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నది ఇది మూడో ఏడాదే. ప్రాజెక్టు భద్రత ప్రమాణాలపై అనుమానాలతో మొదటి నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ నీటిని నిల్వలేదు. గుంటూరు జిల్లా మద్దిపాడు సమీపంలో కృష్ణానదిపై బ్యాలెన్సింగు రిజర్వాయర్‌గా పులిచింతలను నిర్మించారు. కృష్ణా డెల్టాలో దాదాపు 13 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు నీటిని అందించే జలాశయంగా ఉంది.
ఈ గేటుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, లేకుంటే మిగిలిన గేట్లపై ఆ ఒత్తిడి పడుతుందని జల వనరులశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. జల వనరులశాఖ లెక్కల ప్రకారం బుధవారం రాత్రి పులిచింతలలో నీటి నిల్వ దాదాపు 44 టీఎంసీలకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతితో మరమ్మతులు చేయడం పెద్ద సవాలుగా మారింది.
భద్రత ప్రశ్నార్థకం...?
పులిచింతల ప్రాజెక్టు భద్రత ముందు నుంచి ప్రశ్నార్థకంగానే ఉంది. వరుసగా మూడో ఏడాది పూర్తి స్థాయి నీటి నిల్వకు చేరింది. ఇంతలో ప్రాజెక్టు గేటు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఏదో జరుగుతుందని ఊహించగా, ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందని జల వనరులశాఖ నిపుణులు అంటున్నారు. లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది. డ్యాం భద్రతపై గతంలోనే అనేక సందేహాలు తలెత్తాయి. ప్రాజెక్టును జాతికి అంకితం ఇచ్చినప్పుడు నుంచి డ్యాంలో నీరు నిల్వచేసే విషయంలో జల వనరులశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. పులిచింతల డ్యాం పనుల్లో నాణ్యత లేదని, పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తే ప్రమాదకర పరిస్థితి ఉంటుందని నిపుణులు గతంలోనే హెచ్చరించారు.
2015లో నీటి నిల్వపై డ్యాం భద్రతా కమిటీ పరిశీలన చేపట్టింది. డ్యాం నిర్మాణంలో భద్రతాపరంగా అనేక లోపాలు ఉన్న కారణంగా నీటి నిల్వను దశలవారీగా పెంచాలని తెలిపింది. అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. ఇప్పుడు పులిచింతలలో గేటు విరిగిపోవడంతో అప్పట్లో నిపుణుల అనుమానాలు నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయా అనుమానం తలెత్తుతుంది. అప్పట్లో షట్టర్ల పనులపైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా గేట్లు, వాటిని ఎత్తే సమయంలో అవసరమైన ఏర్పాట్లు, పియర్ నిర్మాణాలు, ఇతర కాంక్రీటు, మెకానికల్ పనులు సవ్యంగా లేవని గతంలో నిపుణులు తేల్చిచెప్పారు.
నిపుణుల పరిశీలన
ప్రాజెక్టు గేట్లు ఏర్పాటు చేసిన బెకాన్ కంపెనీ ప్రతినిధులను ప్రభుత్వం పిలిపించింది. నాగార్జునసాగర్, పోలవరం, ఇతర ప్రాంతాల నుంచి నిపుణులను సైతం పిలిపించారు. పోలవరం నుంచి కొందరు ఇంజినీర్లను పిలిపించనున్నట్లు అధికారులు చెప్పారు. వీరు సీఎంవో అధికారులకు ప్రమాదానికి గల కారణాలను తెలిపనున్నారు. ఆ నీటి ప్రవాహాన్ని ఆపేందుకు స్టాప్ లాగ్ తలుపు ఏర్పాటుకు 11 సెగ్మెంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రవాహం తగ్గాక స్టాప్‌లాగ్ ఏర్పాటు ప్రయత్నాలు ప్రారంభించనున్నారు.