Andhra Pradesh: ఆధార్, పాన్ కార్డ్ సేవలు ఇకపై గ్రామ సచివాలయాల్లోనే….
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తోంది. ఆధార్, పాన్ కార్డ్ లాంటి సేవలు కూడా ఇకపై సచివాలయాల నుంచే అందించనుంది.
![Andhra Pradesh: ఆధార్, పాన్ కార్డ్ సేవలు ఇకపై గ్రామ సచివాలయాల్లోనే…. Andhra Pradesh: Aadhaar And Pan Card Services Are Available At Village Secretariats Andhra Pradesh: ఆధార్, పాన్ కార్డ్ సేవలు ఇకపై గ్రామ సచివాలయాల్లోనే….](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/06/3a5a3afc8c0443734a4c80d8f9db4ca6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వాలంటీర్, సచివాలయ వ్యవస్థలు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మానసపుత్రికలని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తోందని.. ఇకపై ఆధార్, పాన్ కార్డ్ లాంటి సేవలు అందించనున్నట్టు చెప్పారు. విజయవాడలో గురువారం గ్రామ, వార్డు సచివాలయాలపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. సచివాలయ సేవలను మరింత విస్తరించడం, ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల నుంచి పుట్టిన ఈ వ్యవస్థల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందించగలుగుతున్నామన్నారు. ప్రతి నెలా చివరి శుక్ర, శనివారాల్లో సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటినీ సందర్శిస్తారన్నారు. ప్రభుత్వ పథకాలతో కూడిన కరపత్రాలను సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి అందిస్తారని చెప్పారు. ఎవరికైనా ప్రభుత్వ పథకాలు అందకపోతే.. అర్హులను గుర్తిస్తారని వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చే ఫిర్యాదుల్లో పరిష్కారమైనవి, తిరస్కరించినవి వేర్వేరుగా చూపాలని అధికారులకు సూచించామన్నారు. సచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లను ఆదేశించారని గుర్తు చేశారు. ఇకపై నెలకు రెండుసార్లు మంత్రులు కూడా సందర్శిస్తామని చెప్పారు. సీఎం జగన్ గ్రామ స్థాయి పర్యటనలు ప్రారంభించేలోపు సచివాలయాలన్నింటినీ పూర్తిగా సిద్ధం చేస్తామన్నారు. వాటి పనితీరును మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సాధారణంగా ఆధార్, పాన్ కార్డ్ పొందాలంటే పెద్ద ప్రాసెస్ ఉండేది. అయితే ఆన్ లైన్లో దరఖాస్తు, సబ్మిడ్ చేసుకోవడం, లేదా స్లాట్ బుక్ చేసుకుని నిర్దేశిత కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ అక్కడకు వెళ్లాక గంటల తరబడి నిరీక్షణ తప్పేదికాదు. కొన్ని ప్రాంతాల్లో ఆధార్ కేంద్రాలు స్లాట్ కూడా దొరకనంత బిజీగా ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇకపై సచివాలయాల్లోనే ఆధార్, పాన్ కార్డు సర్వీసులు అందిస్తామన్న ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ఉయోగపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ప్రొబేషన్ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను కొంతమంది తప్పుదారి పట్టిస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొబేషన్ విషయంలో ఎటువంటి రాజకీయాలు ఉండవన్నారు. ఉద్యోగులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. ఆగస్టులో, సెప్టెంబర్‌లో డిపార్ట్‌మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 35 శాతం మందికి పరీక్షలు పూర్తయ్యాయన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక సీఎస్ అజయ్ జైన్ పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)