TDP: అమరావతిలో ప్రెస్ మీట్ తర్వాత కనిపించని అనంతపురం టీడీపీ మహిళా నేతలు.. వెతుకుతున్న పోలీసులు
అనంతపురం జిల్లా టీడీపీ మహిళా నేతల అరెస్ట్ వ్యవహారం పోలీసులుకు తలనొప్పిగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ కాకుండా చూస్తున్నారు.
అనంతపురం పోలీసులకు సమస్యగా మారిపోయింది తెలుగు మహిళా నేతల అరెస్ట్ వ్యవహారం. చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అనంతపురం తెలుగు మహిళా నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ముఖ్యమంత్రి, మంత్రుల కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. దీనిపై అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. విచారణలో భాగంగా తెలుగు మహిళా నేతలు కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తరువాత కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులు కూడా ఇష్యూని సీరియస్ గా తీసుకొన్నారు.
మరుసటి రోజు మహిళా నేతల ఇళ్లు, కార్యాలయాలు ముట్టడించి సోదాలు చేశారు. ఈ అంశం మరింత దుమారం రేపింది. ఇళ్లలోకి వచ్చి పోలీసులు బ్యాంకు ఖాతాలు, పోన్లు తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రెస్ మీట్ పెట్టమని ఏమైనా డబ్బులు ఇచ్చారా అన్న కోణంలో విచారణ చేశారు. అయితే వివాదం తీవ్రం కావడం, తెలుగు మహిళా నేత పురుగుల మందు తాగడంతో పోలీసులు కూడా వెనక్కి తగ్గారు.
అనంతపురం తెలుగు మహిళా నేతలు.. అమరావతికి వెళ్లారు. అక్కడ రాష్ట్రస్థాయి మహిళా నేతలతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. తమను ఏ విధంగా వేధించారన్న అంశంపై విరుచుకుపడ్డారు. ప్రెస్ మీట్ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి వాళ్లు ఎక్కడున్నారనేదానిపై పోలీసులు గాలింపు చేపడుతున్నారు. వారిని అరెస్ట్ చేయాలన్నదానిపై పోలీసులు సీరియస్ గా తీసుకొని విచారణ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు వారి ఆచూకీ దొరకలేదు.
హైదారాబాద్ లో తలదాచుకొన్నారన్న సమాచారంతో అక్కడ కూడా గాలింపు చర్యలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఇప్పటికే వెతికినట్టు సమాచారం. కానీ అక్కడ కూడా దొరక్కపోవడంతో జిల్లాకు చెందిన ప్రముఖ సెలబ్రిటీ, ఒక ఎమ్మెల్యే ఇంట్లో వున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. అయితే అక్కడికి పోలీసులు వెళ్లలేదు. దీంతో మహిళా నేతల ఎక్కడ ఉన్నారనేది పోలీసులకు తలనొప్పిగా మారింది. మహిళా నేతలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు.. మహిళా నేతల బంధువులను టార్గెట్ చేశారు.
వీలైనంత తొందరగా వారిని అప్పజెప్పకపోతే ఇబ్బందులు తప్పవన్నట్లు హెచ్చరించినట్టు తెలుస్తోంది. మరోవైపు వీరి బెయిల్ అంశం కూడా కోర్టులో తేలే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలోపు వీరిని అరెస్ట్ చేయాలని పోలీసులు అనుకుంటున్నారు. వారి వెనక అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఉన్నారన్న కోణంలో ఆయనపై కూడా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ అంశం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.
Also Read: AP NGT Polavaram : పర్యావరణ అనుమతుల ఉల్లంఘన.. ఏపీ ప్రాజెక్టులకు ఎన్జీటీ రూ. 120 కోట్ల జరిమానా !