(Source: ECI/ABP News/ABP Majha)
Singanamala Politics: ఏపీలో ఈ నియోజకవర్గం చాలా స్పెషల్! ఇక్కడ గెలిచిన పార్టీదే అధికారం, ఇదే చంద్రబాబుకి తలనొప్పి!
అనంతపురం జిల్లాలోని ఈ నియోజకవర్గంలో విజయం సాధించిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ బలంగా ఉంది.
అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నియోజకవర్గంలో విజయం సాధించిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ బలంగా ఉంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శైలజనాథ్ ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అప్పటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.. రెండోసారి శైలజానాధ్ గెలవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున యామిని బాల విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ తరఫున జొన్నలగడ్డ పద్మావతి విజయం సాధించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు.
ఇలా పలుదఫాలుగా ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఇక్కడ ప్రజల నమ్మకం. అయితే ప్రస్తుతం ఎస్సీ నియోజకవర్గమైన సింగనమలలో తెదేపాలో గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఆశించే వారి సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుంది. నియోజకవర్గంలో బుక్కరాయసముద్రం, నార్పల, సింగనమల, గార్లదిన్నె, ఎల్లనూరు, పుట్లూరు మండలాలు ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువైంది.
ప్రస్తుత రాజకీయాల పరిణామాల దృష్ట్యా చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ రావడం.. మాజీమంత్రి నారా లోకేష్ యువగలం పునర్ ప్రారంభం కావటం తెలుగుదేశం పార్టీ కి రాష్ట్రంలో కొంత పుంజుకున్నట్లు కనిపిస్తున్నాయి. రాష్ట్ర నేతల్లోనూ వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తుందని ధీమా పెరిగింది. దీంతో నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించే వారి సంఖ్య కూడా పెరిగింది. 2014 ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన యామిని బాల ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో బండారు శ్రావణి తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థిగా నిలబడి ఓటమి చవిచూశారు. అనంతరం పార్టీలో అంతర్గత విభేదాలతో సింగనమల నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
చంద్రబాబు వద్దకు పంచాయతీ
పలుమార్లు సింగనమల పంచాయతీ చంద్రబాబు వరకు వెళ్ళింది. పలుమార్లు చంద్రబాబు చెప్పినా కానీ, నియోజకవర్గంలో అదే సీన్ రిపీట్ అవడంతో చంద్రబాబు నాయుడు సింగనమలలో బండారు శ్రావణికి ఇంచార్జ్ బాధ్యతలు తప్పించి ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో గార్లదిన్నె మండలానికి చెందిన ముంటిమడుగు కేశవ రెడ్డి నార్పల మండలం చెందిన ఆలం నర్సా నాయుడు నాయుడుకి కమిటీలో వేశారు. ఈ కమిటీ వేయడంతో అనంతపూరం జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో శ్రావణి వర్గం ఆందోళనకు దిగింది.
ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ ఆదేశించిన కార్యకలాపాలు అన్నీ కూడా వేరువేరుగా చేసుకుంటూ వెళ్తున్నారు. బండారు శ్రావణి తన వర్గంతో కార్యక్రమాలు చేపట్టడం.. మరోవైపు ద్విసభ్య కమిటీ సభ్యులు పార్టీ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఇలా గ్రూపులుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు చేస్తుండడంతో నియోజకవర్గంలోని తెలుగుదేశం క్యాడర్ అయోమయ పరిస్థితిలో పడింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సాకే శైలజ తెదేపా తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో అరెస్టును తప్పుపడుతూ సాకే శైలజనాథ్ పలుమార్లు మీడియాలో ఖండించారు. ప్రస్తుతం సింగనమల నియోజకవర్గం నుంచి వైకాపా అరాచకాలు ఎండగడుతూ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకుడు ఎమ్మెస్ రాజు దాటిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన కూడా తనకు పార్టీ టికెట్ ఇస్తారన్న ఆశాభావంతో పెద్ద ఎత్తున నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నాడు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నియోజకవర్గంలో ఇప్పటికైనా గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టే విధంగా నిర్ణయం తీసుకొని పార్టీని బలోపేతం చేయాలని నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు.