MP Gorantla Madhav : మరో వివాదంలో ఎంపీ గోరంట్ల మాధవ్, ఇంటి అద్దె చెల్లించమంటే యజమానికి బెదిరింపులు!
MP Gorantla Madhav : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇంటి అద్దె, కరెంట్ బిల్లు బకాయిలు చెల్లించడంలేదని ఎంపీపై ఇంటి యజమాని ఆరోపించారు.
MP Gorantla Madhav : అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అనంతపురంలో గోరంట్ల మాధవ్ నివసిస్తున్న ఇంటికి అద్దె చెల్లించడంలేదని ఇంటి యజమాని మల్లికార్జున రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అద్దె అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని ఇంటి యజమాని ఆరోపించారు. ఈ వ్యవహారంలో పోలీసులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అనంతపురం నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్లో ఇంటి అద్దె పంచాయితీ జరిగినట్లు సమాచారం. తనకు రావలసిన అద్దె ఇప్పించి ఇంటిని ఖాళీ చేయాలని ఇంటి యజమాని డిమాండ్ చేస్తున్నారు.
అద్దె చెల్లించమంటే బెదిరింపులు!
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్.. అనంతపురం పట్టణంలోని రామ్‌నగర్‌లో అద్దెకు ఉంటున్నారు. ఆ ఇంటి అద్దె, కరెంట్ బిల్లులు చెల్లించలేదని ఎంపీపై ఇంటి యజమాని ఆరోపణలు చేశారు. ఆ ఇంటికి రూ. 2 లక్షలకు పైగా అద్దె, విద్యుత్ బకాయిలు ఉన్నట్లు ఓనర్ అంటున్నారు. అద్దె బకాయిలు చెల్లించకపోగా ఇల్లు ఖాళీ చేయనని బెదిరిస్తున్నారని ఇంటి యజమాని మల్లికార్జున రెడ్డి ఆరోపిస్తున్నారు. అద్దె అడిగితే టిప్పర్లతో తొక్కించి చంపుతామంటూ గోరంట్ల మాధవ్ అనుచరులు బెదిరిస్తున్నారని మల్లికార్జున రెడ్డి ఆవేదన చెందుతున్నారు. ఈ వ్యవహారం అనంతపురం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
పోలీసుల సమక్షంలో పంచాయితీ
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటి అద్దెపై వివాదం పోలీసు స్టేషన్ కు చేరింది. ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి యజమాని తన మనుషులతో కలిసి ఎంపీ ఉంటున్న ఇంటి ఎదుట ధర్నా చేయాలని భావించారు. ఈ విషయం తెలుసుకున్న నాలుగో పట్టణ సీఐ జాకీర్ హుస్సేన, టూటౌన్ సీఐ శివరాముడు, పలువురు ఎస్‌ఐలు, సిబ్బంది అక్కడికి చేరుకుని మల్లికార్జునరెడ్డితో మాట్లాడి సర్దిచెప్పారు. ఆ తరువాత సీఐ జాకీర్‌హుస్సేన్ పెద్దమనుషుల సమక్షంలో ఇంటి యజమాని, ఎంపీ మాధవ్‌తో ఓ గదిలోకి చర్చలు జరిపారు. అక్కడ కూడా సమస్య కొలిక్కిరాకపోవడంతో మరోసారి మాట్లాడాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఎంపీ ఇంటి అద్దె బకాయిలు చెల్లించి ఇళ్లు ఖాళీ చేయాలని యజమాని డిమాండ్ చేస్తున్నారు.
నగ్న వీడియో వివాదం
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు వివాదాలు కొత్తేమీ కాదు. ఇటీవల సోషల్ మీడియాలో ఎంపీ గోరంట్ల మాధవ్‌కు చెందిన అభ్యంతరకర వీడియో వైరల్ అయింది. అందులో ఎంపీ చొక్కా లేకుండా ఒక మహిళతో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఆయన నగ్నంగా కాల్ మాట్లాడారు అంటూ ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. అయితే గోరంట్ల మాధవ్....టీడీపీ నేతలు వీడియో మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. తాను జిమ్ లో ఉండగా వీడియో తీసుకున్నానని, ఆ వీడియోను, ఓ మహిళతో మాట్లాడుతున్నట్లుగా మార్ఫింగ్ చేశారని గోరంట్ల మాధవ్ అప్పట్లో వివరణ ఇచ్చారు. టీడీపీ నేతలు కుట్ర పూరితంగా ఈ పని చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై సైబర్ సెల్ ఫిర్యాదు చేశారు. ఈ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేసిన పోలీసులు అది ఫేక్ వీడియో అని తేల్చారు. ఆ వీడియో ఒరిజినల్ కాదని అప్పట్లో ఎస్పీ ఫకీరప్ప పేర్కొన్నారు. ఒరిజినల్ వీడియో దొరికితేనే అసలు విషయం బయట పడుతుందన్నారు. అయితే మొదట ఐ-టీడీపీ వాట్సాప్ గ్రూప్ లో ఈ వీడియో షేర్ అయిందని ఎస్పీ తెలిపారు. ఎంపీ గోరంట్ల మాధవ్ ను ఈ వ్యవహారం నుంచి తప్పించేందుకు పోలీసులు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి.