Anakapalli Tiger Roaming : అనకాపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం, సీసీ కెమెరాల్లో రికార్డు
Anakapalli Tiger Roaming : అనకాపల్లి జిల్లాలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు నిర్ధారించారు. జిల్లాలోని విస్సన్నపేటలో గేదెను పెద్దపులి చంపినట్లు తెలిపారు.
Anakapalli Tiger Roaming : అనకాపల్లి జిల్లా పెద్ద పులి సంచారం స్థానికుల్ని భయాందోళనకు గురిచేస్తుంది. తాజాగా కశింకోట మండలం బయ్యవరం విస్సన్నపేట అటవీ ప్రాంతంలోనే బెంగాల్ టైగర్ సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. విస్సన్నపేట పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో పెద్ద పులి సంచరిస్తు్న్నట్లు తెలిసిందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. సీసీ కెమెరాల్లో పెద్ద పులి గేదెపై దాడి చేసి చంపినట్లు రికార్డు అయింది. కళేబరాన్ని తినడానికి వచ్చిన సమయంలో సీసీ కెమెరాలో రికార్డు అయింది. విస్సన్నపేట పరిసర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తు్న్నారు. పులిని పట్టుకోవడం కోసం అధికారులు బోను ఏర్పాటు చేశారు. పెద్ద పులికి ఎరగా మరో గేదెను బోనులో పెట్టారు ఫారెస్ట్ సిబ్బంది. కాకినాడ జిల్లాలో ఏర్పాటుచేసిన బోను కన్నా పెద్ద బోను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.
వైరల్ వీడియో
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం పందూరులో పులి కనిపించిందనే ప్రచారం జరిగింది. గ్రామంలోని పెద్దమ్మ తల్లి ప్రాంగణం వద్ద ఉన్న రోడ్డుపై అడ్డంగా పడుకున్న పెద్దపులి వీడియో ఇటీవల వైరల్ అయింది. పరిసర ప్రాంతాల్లోనే పులి సంచరించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రోడ్లపై వాహనాల రాకపోకలను గమనించి పక్కనే ఉన్న దార్లపూడి అడవిలోకి పులి పారిపోయినట్లు స్థానికులు అంటున్నారు. పులి కాకినాడ జిల్లా నుంచి అనకాపల్లిలోకి ప్రవేశించిన పులేనా లేక వేరేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల నెల రోజుల పాటు కాకినాడ జిల్లా వాసులకు కంటిమీద కనుకులేకుండా చేసింది పెద్దపులి. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం తాడిపత్రి, శ్రీరాంపురం గ్రామ సమీపంలోని జీడిమామిడి తోటలో పెద్దపులి అడుగు జాడులు కనిపించాయి. శ్రీరాంపురం గ్రామానికి చెందిన పాడి గేదెపై పులి పంజా విసిరి చంపేసింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తిరుమలలో చిరుత హల్ చల్
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత హల్ చల్ చేసింది. మొదటి ఘాట్ రోడ్డు 34వ మలుపు వద్ద చిరుత రోడ్డు దాటుతూ భక్తులకు కనిపించింది. తిరుమల నుంచి తిరుగు ప్రయాణంలో ఓ భక్తుడు తమ వాహనం వస్తున్నప్పుడు చిరుత రోడ్డు దాటుతుండడం గమనించారు. చిరుత రోడ్డు దాటుతున్న దృశ్యాన్ని తన సెల్ ఫోన్ లో భక్తుడు చిత్రీకరించారు. ఈ సమాచారాన్ని అందుకున్న అటవీ శాఖ, విజిలెన్స్ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అలిపిరి నడక మార్గం గుండా తిరుమలకు వస్తున్న భక్తులను అప్రమత్తం చేసి గుంపులు గుంపులుగా పంపించడమే కాక భక్తులకు సూచనలు ఇస్తున్నారు.