Andhra Pradesh: చంద్రబాబుకు జెడ్ ప్లస్, లోకేష్‌కి జెడ్, పవన్‌కి వై ప్లస్- ఏంటీ సెక్యూరిటీ విభాగాలు
Security Categories: దేశంలో ప్రాణానికి ముప్పున్న కీలక వ్యక్తులకు వారి స్థాయి, ముప్పు ఆధారంగా పలు కేటగిరీల్లో కేంద్ర భద్రతా బలగాలుసెక్యూరిటీని కల్పిస్తాయి. ఆ విశేషాలేంటో చూద్దాం.
Y Plus Security For Pawan : భారతదేశంలో ప్రాణానికి ముప్పు ఉన్న కీలకమైన వ్యక్తులకు, రాజకీయ నాయకులకు వారి స్థాయి, వారి ప్రాణానికున్న ముప్పు ఆధారంగా పలు కేటగిరీల్లో కేంద్ర భద్రతా బలగాలు, పోలీసులు, ప్రభుత్వాలు సెక్యూరిటీని కల్పిస్తాయి. వీటిని ఆరు విభాగాలుగా విభజించారు.
ఎస్‌పీజీ, జెడ్ ప్లస్, జెడ్, వై ప్లస్, వై, ఎక్స్ కేటగిరీల్లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. స్పెషల్ పోలీస్ గ్రూప్, డిల్లీ పోలీస్, ఐటీబీపీ(ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్), సీఆర్‌పీఎఫ్(సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్) , ఎన్ఎస్‌జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్), సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ పోలీస్ ఫోర్స్) లకు చెందిన భద్రతా బలగాలు ఆయా కేటగిరీల్లో సెక్యూరిటీ అందిస్తాయి.
ఎస్‌పీజీని మినహాయించి మిగతా కేటగిరీల్లో భద్రత కోసం కేంద్ర హోం శాఖ అనుమతులు అవసరం. ఇంటిలిజెన్స్ వర్గాల నివేదికలు ఆధారం చేసుకుని ఎవరెవరికి ప్రాణ హాని, ఏ మేరకు ఉందో అంచనా వేసి వారికి కేటగిరీల వారీగా కేంద్ర హోం శాఖ భద్రత కల్పిస్తుంది.
ఎస్‌పీజీ
ఎస్‌పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) దేశ ప్రధానికి రక్షణ కల్పిస్తుంది. ప్రస్తుతానికి ఈ కేటగిరీ కింద రక్షణ పొందుతున్న ఏకైక వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే. ప్రధాని ఇంటి వద్ద, కార్యాలయం వద్ద, ఆయన దేశ, విదేశ పర్యటనలన్నింటికీ ఈ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నుంచి ప్రత్యేక బృందం వెళ్తుంది. 24 గంటలూ ప్రదానికి రక్ణణ కల్పిస్తుంది. దాదాపు వీరిని దాటుకుని ప్రధాని వద్దకు వెళ్లడం అంత ఈజీకాదు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హత్య అనంతరం 1991 నుంచి 2019 వరకు దాదాపు 29 ఏళ్లు సోనియా గాంధీ కుటుంబం మొత్తానికి ఈ ఎస్‌పీజీ భద్రతే కల్పించారు. 2019లో ఈ చట్టానికి వచ్చిన సవరణ వల్ల వారికి ఈ భద్రతను వెనక్కి తీసుకున్నారు. ప్రదానితోపాటు ప్రధాని కుటుంబ సభ్యులకు సైతం రక్షణ కల్పించే వెసులుబాటు ఉండగా 2019 సవరణ కేవలం ప్రధాని ఒక్కరికే ఈ ఈ విభాగంలో భద్రతను పరిమితం చేసింది. దీనికంటూ ప్రత్యేకంగా రూ.510 కోట్ల మేరకు వార్షిక బడ్జెట్ ఉంది. దాదాపు 3,000 మంది ఈ ఎస్‌పీజీ కింద పనిచేస్తారు. వీరి వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి. ప్రత్యేకంగా తయారు చేసిన అత్యాధునిక బుల్లెట్ ప్రూఫ్ కార్లతోపాటు రెండు ఎయిరిండియా విమానాలు ప్రధాని కోసం కేటాయిస్తారు.
రాష్ట్రపతికి ఇలా..
భారత రాష్ట్రపతికి మిలటరీలో అత్యంత అనుభవం కలిగిన విభాగమైన ‘ది ప్రెసిడెంట్స్ బాడీ గార్డ్’’ అనే విభాగం భద్రత కల్పిస్తుంది. ఇది సాయుధ బలగాల్లో అతి పురాతన విభాగం.
జెడ్ ప్లస్ కేటగిరీ
ఈ విభాగంలో భద్రత పొందే వారికి పది మంది ఎన్ఎస్‌జీ కమాండోలు సహా 56 మంది భద్రతా బలగాల బృందం 24 గంటలూ రక్షణ కల్పిస్తుంది. ఎన్ఎస్‌జీ బృందాల వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి. తొమ్మిది బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉంటాయి. నెలకు రూ.33 లక్షలు దీని కోసం ఖర్చవుతుంది. దేశంలో దాదాపు 63 మందికి ప్రస్తుతం ఈ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత పొందుతున్నారు. ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర కేబినేట్ సభ్యులు, కొందరు సీఎంలు మాత్రమే ఈ కేటగిరీ భద్రత పొందుతారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొంతమంది ఇతరులు కూడా ఈ కేటగిరీలో భద్రత పొందుతున్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, హోమ్ మంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి వారు ఈ లిస్టులో ఉన్నారు.
జెడ్ క్యాటగిరీ భద్రత
ఈ క్యాటగిరీలో నలుగురు నుంచి ఆరుగురు సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్ కమాండోలు సహా మొత్తం 22 మంది సెక్యూరిటీ బృందం 24 గంటల సెక్యూరిటీ ఇస్తుంది. కనీసం రెండు బుల్లెట్ ప్రూఫ్ కార్లతో మొత్తం నాలుగు కార్లు కేటాయిస్తారు. ముగ్గురు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉంటారు. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ కు ప్రస్తుతం జెడ్ క్యాటగిరీ భద్రత కల్పిస్తున్నారు.
వై ప్లస్ క్యాటగిరీ భద్రత
ఈ విభాగంలో భద్రత పొందే వారికి కనీసం ఇద్దరు కమెండోలతో సహా 11 మందితో భద్రత కల్పిస్తారు. ముగ్గురు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు 24 గంటలూ అందుబాటులో ఉంటారు. రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతోపాటు మూడు వాహనాలు కేటాయిస్తారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎంపీ, నటి కంగనా రనౌత్ వంటి వారికి ప్రస్తుతం వై ఫ్లస్ క్యాటగిరీ భద్రత కల్పిస్తున్నారు.
వై కేటగిరీ భద్రత
కొంత తక్కువగా ప్రాణాపాయం ఉన్న వారికి వై కాటగిరీ భద్రత కల్పిస్తారు. ఎనిమిది మంది భద్రతా సిబ్బంది వీరికోసం పనిచేస్తారు. ఇద్దరు 24 గంటల భద్రత కల్పిస్తారు.
ఎక్స్ కేటగిరీ భద్రత
బాగా తక్కువగా ప్రాణాపాయం ఉన్న వీఐపీలకు ఈ ఎక్స్ స్థాయి భద్రత కల్పిస్తారు. దీని కింద వీరికి ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు 24 గంటలూ అందుబాటులో ఉంటారు. 2023 వరకు ఉన్న లెక్కలు చూస్తే జెడ్ ప్లస్ కాకుండా.. మొత్తం దాదాపు 300 మందికి పైగా జెడ్ నుంచి ఎక్స్ క్యాటగిరీ వరకు వివిధ కేటగిరీల భద్రత పొందుతున్నారు.