Sharmila News: మంగళగిరి ఆర్కే అందుకే మళ్లీ వైసీపీలోకి, ఆ బాధ అర్థం చేసుకోగలను - షర్మిల
Sharmila With R.K: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేపై ఒత్తిడి తీసుకొచ్చి మళ్లీ వైసీపీలో చేర్చుకున్నారని షర్మిల అన్నారు. ఆయన బాధను అర్థం చేసుకోగలనని.. ఆయన ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటానని అన్నారు
Sharmila News: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(RK)ని బెదిరించి, భయపెట్టి మళ్లీ వైసీపీలో చేర్చుకున్నారని పీసీసీ(PCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. ఆర్కేపై ఎంత ఒత్తిడి ఉందో తనకు తెలుసునన్నారు. ఆయన పార్టీలో ఉన్నా లేకున్నా తనకు దగ్గర మనిషేనని ఆమె తెలిపారు. ఆయనకు ఉన్న ఇబ్బందులను అర్థం చేసుకోగలనని చెప్పారు. ఇటీవలే వైసీపీ(YSRCP) నుంచి కాంగ్రెస్ లో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Rama Krishna Reddy)...తిరిగి మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు.
ఒత్తిడి చేసి లాక్కున్నారు
ఇటీవలే వైసీపీ(YSRCP) నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ (Congress)పార్టీలో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(RK)..తిరిగి మళ్లీ సొంత గూటికి వెళ్లడంపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల(Sharmila) స్పందించారు. మంగళగిరిలో వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థి లేకపోవడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డిని భయపెట్టి, బెదిరించి మళ్లీ పార్టీలో చేర్చుకున్నారని ఆమె ఆరోపించారు. ఆయనపై ఎంత ఒత్తిడి ఉందో తాను అర్థం చేసుకోగలనన్నారు. ఆయన ఎక్కడ ఉన్నా తనకు దగ్గర మనిషేనంటూ జాలి చూపారు. ఆయన ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటానన్నారు. ఆళ్లపై ఉన్న ఒత్తిడి అంతా ఇంతకాదన్న షర్మిల...ఆయన చెల్లిగా నేను అర్థం చేసుకోగలనని చెప్పారు. అతకు ఒక మంచి మనిషని...కాకపోతే రాంగ్ ప్లేస్ లో ఉన్నారని సానుభూతి వ్యక్తం చేశారు.
న్ ఛార్జిని మారిస్తే పార్టీ మార్చారు
ముఖ్యమంత్రి జగన్(Jagan) కు నమ్మినబంటు, వైసీపీకి అసలు సిసలైన కార్యకర్తగా పనిచేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. రాజధాని ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యేగా తెలుగుదేశం(TDP) ప్రభుత్వానికి కంటిలో నలుసులా మారారు. రాజధానికి భూములు ఇవ్వకుండా కొన్ని గ్రామాలను సంఘటితం చేయడం, రాజధాని పై హైకోర్టులో కేసులు వేసి చంద్రబాబు(Chandrababu Naidu)ను, తెలుగుదేశం ప్రభుత్వాన్ని బాగానే ఇరుకునపెట్టారు. అంతేగాక గత ఎన్నికల్లో ఏకంగా లోకేశ్ ను ఓడించినా....జగన్ మంత్రివర్గంలో ఆయన చోటు దక్కించుకోలేకపోయారు. అప్పటి నుంచి అసంతృప్తిగా నే ఉన్న ఆర్కే...మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా జగన్ తనను గుర్తుంచుకుంటారని భావించారు. అప్పుడూ రిక్తహస్తమే ఎదురవ్వగా...ఇప్పుడు ఏకంగా మంగళగిరి టిక్కెటే లేదని జగన్ తేల్చి చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురైన రామకృష్ణారెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు.
అనంతరం ముఖ్యమంత్రి జగన్ పైనా, వైసీపీపైనా తీవ్ర అవినీతి ఆరోపణలు చేసి షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కాంగ్రెస్ లోచేరారు. అప్పటి నుంచి తీవ్ర తర్జన భర్జనల పడిన వైసీపీ అధిష్టానం తిరిగి ఆర్కేను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను సీనియర్ నేత విజయసాయిరెడ్డి(Vijaya Saireddy)కి అప్పంగించారు. ఆయన నయానో, భయానో రామకృష్ణారెడ్డి ఒప్పించడంతో జగన్ సమక్షంలో మళ్లీ వైసీపీలో చేరారు. డిసెంబర్ 11న వైసీపీకి రాజీనామా చేసిన ఆయన జనవరి 21న కాంగ్రెస్ లోచేరారు. మళ్లీ ఫిబ్రవరి 21 రాకుండానే మళ్లీ వైసీపీ గూట్లో వాలిపోయారు. మంగళగిరి సీటు ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ చేనేత వర్గానికి ఇవ్వాలని వైసీపీ పట్టుదలగా ఉంది. లోకేశ్ ను దీటుగా ఎదుర్కొవాలంటే చేనేత వర్గానికే సీటు ఇవ్వాలని భావిస్తోంది. మరి ఆళ్ల రామకృష్ణారెడ్డిేని ఏ ప్రాతిపదికన మళ్లీ పార్టీలో చేర్చుకున్నారో తెలియలేదు.