ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ స్కూల్స్ బంద్;అధికారుల వేధింపులపై ఆగ్రహం, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమంటూ హెచ్చరిక!
Andhra Pradesh: ఏపీలో ప్రైవేట్ స్కూల్స్‌కు గురువారం సెలవులు ప్రకటించారు. కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా బంద్ ప్రకటించాయి విద్యాసంస్థల యాజమాన్యాలు. అందులో భాగంగా సెలవు ప్రకటించారు.

Andhra Pradesh Private Schools : ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ స్కూల్స్‌ను ఒకరోజు మూసివేస్తున్నట్టు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి సహాయసహకారాలు అందుతున్నప్పటికీ కొందరు అధికారుల తీరు సరిగా లేదని స్కూల్ యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. అధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ లేఖాస్త్రం సంధించారు. తమ బాధలు చెప్పుకొంటూ గురువారం స్కూల్స్ మూసి వేసి నిరసన తెలియజేస్తున్నట్టు వెల్లడించాయి.
ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు పునరుద్ధరణను 8 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పొడిగించి, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు కూడా ప్రతిభా అవార్డులు తల్లికి వందనం పథకం అందిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పారు. కానీ కొంతమంది అధికారులు అతిగా స్పందించి పాఠశాలలపై కమిటీలు, తనిఖీలు అంటూ హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. ఏకపక్ష వార్తలు, కొందరి లేఖలు, తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా నోటిసులు జారీ చేస్తున్నారని అన్నారు. చెప్పిన వాటిని వెంటనే అమలు చేయాలని ఆదేశాలు ఇస్తున్నారని వాపోయారు. కొందరు అధికారుల నుంచి వస్తున్న అభ్యంతరకర సందేశాలు, హెచ్చరికలు వేదన కలిగిస్తున్నాయన్నారు. వీటి ఫలితంగా పాఠశాల నిర్వహణకు అంతరాయం ఏర్పడుతుందని వివరించారు. ఇది బడిలో పని చేసే సిబ్బంది, చదువుకునే విద్యార్థులపై ప్రభావం చూపుతోందని తెలిపారు.
RTE 12.1.c దరఖాస్తుదారులను తగిన ధృవీకరణ లేకుండా చేర్చుకోవాలని అధికారులు బలవంతం చేస్తున్నారని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తెలిపాయి. లేకుంటే షోకాజ్ నోటీసులతో వేధించడం, గుర్తింపు రద్దు చేస్తామని బెదరించడం చేస్తున్నారని వాపోయారు. ఈ చర్యలకు ప్రతిస్పందనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు గురువారం అంటే 3జులై 2025న మూసివేస్తున్నట్టు ప్రకటించారు.
ప్రభుత్వం తమ వేదన అర్ధం చేసుకుని, సమస్యలను పరిష్కరించాలని, హక్కులను కాపాడవలెనని విజ్ఞప్తి చేశారు. రూల్స్ సరిగ్గా పరిశీలించకుండా నోటిసులు ఇవ్వొద్దని, చర్యలకు తీసుకోవద్దని అభ్యర్థించారు. రాష్ట్రంపై ఆర్థిక భారం లేకుండా రాష్ట్రంలో 55% కంటే ఎక్కువ మంది విద్యార్ధులకు సేవలందిస్తున్నామని వివరించారు. ప్రైవేట్ పాఠశాలల్లో దాదాపు 85% స్కూల్స్, ప్రభుత్వం చేసే ఖర్చులో మూడో వంతు కన్న తక్కువకే నాణ్యమైన విద్య అందిస్తున్నట్టు ప్రకటించారు. ప్రైవేట్ పాఠశాలల నిర్వహణకు అంతరాయమేర్పడితే 10వేలకుపైగా యాజమాన్యాలు ఎఫెక్ట్ అవుతాయని, దాదాపు 3 లక్షల మంది సిబ్బంది, 40 లక్షల మంది విద్యార్థులు సమస్యల్లో పడతారని తెలిపారు. ఏమైనా జరిగితే ఏకపక్ష చర్యలు తీసుకునే అధికారులే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు.





















