(Source: ECI/ABP News/ABP Majha)
TDP News: వైఎస్ఆర్ సీపీ దారిలోనే టీడీపీ, ద్రౌపది ముర్ముకే మద్దతు - కారణం ఏంటంటే
AP లో అధికార పక్షం వైఎస్ఆర్ సీపీ ద్రౌపది ముర్మూకే మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీడీపీ కూడా ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు పలికింది.
ఈ నెలలోనే జరగనున్న భారత రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనే విషయంపై టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే కూటమి ప్రతిపాదించిన అభ్యర్థి ద్రౌపది ముర్మూకే మద్దతు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. సామాజిక న్యాయానికే తొలి నుంచి టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గిరిజన తెగకు చెందిన వారు కావడం, దేశంలోనే తొలి గిరిజన మహిళ రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉండడం వల్ల ఆమెకు తాము మద్దతు ఇస్తున్నట్లుగా చంద్రబాబు తెలిపారు.
ఇప్పటికే ఏపీలో అధికార పక్షం వైఎస్ఆర్ సీపీ ద్రౌపది ముర్మూకే మద్దతు పలికిన సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్థిని ఖరారు చేయగానే, వారు మద్దతు ప్రకటించారు. గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన టీడీపీ, మళ్లీ ఎన్డీఏకే మద్దతు పలకడం ప్రాధాన్యం సంతరించుకుంది.
విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలన్నీ కలిపి యశ్వంత్ సిన్హాను ద్రౌపది ముర్ముకు ప్రత్యర్థిగా నిలిపాయి. అయితే, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపదీ ముర్మూ బరిలో నిలవగా.. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు.