Nara Lokesh: యువగళం తరువాత తొలిసారి మంగళగిరికి లోకేష్, ప్రముఖులతో భేటీ!
Nara Lokesh Visits Mangalagiri: సుదీర్ఘ యువగళం పాదయాత్ర అనంతరం టీడీపీ నేత నారా లోకేష్ తొలిసారి మంగళగిరి నియోజకవర్గానికి వెళ్లారు. ప్రముఖులతో భేటీ అయ్యారు.
TDP News: మంగళగిరి: రాష్ట్రంలో జగన్ అరాచకపాలనను అంతం చేస్తానంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర కారణంగా నియోజకవర్గానికి కొంచెం దూరంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 226 రోజులపాటు 3,132 కి.మీ.ల మేర పాదయాత్ర పూర్తిచేసిన లోకేష్ సొంత నియోజకవర్గం మంగళగిరికి 11నెలల తర్వాత తొలిసారి వెళ్లారు. సుదీర్ఘకాలం తర్వాత మంగళగిరి (Mangalagiri)లో పర్యటించడంతో టీడీపీ శ్రేణులు, మద్దతుదారులు లోకేష్ కు ఆత్మీయస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు తటస్థ ప్రముఖులతో లోకేష్ భేటీ అయి.. నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రణాళికలపై వారితో మాట్లాడారు.
మొదటగా నారా లోకేష్ ఆత్మకూరులో మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, మంగళగిరి పట్టణంలో అతిపెద్ద మాస్టర్ వీవర్ అయిన జొన్నాదుల వరప్రసాద్ నివాసానికి వెళ్లారు. మంగళగిరిలో చేనేతలు, నేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాబోయే రోజుల్లో వారి కోసం చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలపై ఆయనతో లోకేష్ చర్చించారు.
కనకయ్య, అల్మాస్ లతో ఆత్మీయ సమావేశం అనంతరం పద్మశాలి బహుత్తమ సేవా సంఘం అధ్యక్షుడు చింతకింది కనకయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పద్మశాలీయుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలంగా పోరాడుతున్న కనకయ్య పలు సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించిన సుదీర్ఘ యువగళం పాదయాత్రలో ధర్మవరం, వెంకటగిరి వంటి ప్రాంతాల్లో పద్మశాలీయులు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లారా చూశానన్నారు. మరో 3నెలల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాబోయే ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
సుదీర్ఘ పాదయాత్ర అనంతరం తొలిసారి మంగళగిరిలో పర్యటించిన నారా లోకేష్. వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులతో భేటీ.#NaraLokesh #YuvaGalam #TeluguDesamParty #NavaSakamBegins #AndhraPradesh #mangalgiri pic.twitter.com/8plG6Hjr0O
— YuvaGalam (@yuvagalam) December 26, 2023
గత ఎన్నికల్లో ఓటమి పాలైనా గత నాలుగున్నరేళ్లుగా మీలో ఒకడిగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నానని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలందించేలా తనను ఆశీర్వదించాలని లోకేష్ కోరారు. తర్వాత ప్రముఖ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి షేక్ సాదియా అల్మాస్, వారి కుటుంబసభ్యులను మర్యాదపూర్వకంగా కలిశారు. అల్మాస్ 2021లో టర్కీలో జరిగిన ఆసియన్ అక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ అండ్ బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్, 2020లో గజియాబాద్ లో జరిగిన నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పతకం సాధించారు.
తాడేపల్లిలో విస్తృతస్థాయి సమావేశం
మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం బుధవారం (27-12-2023) సాయంత్రం 4గంటలకు తాడేపల్లిలో సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా నారా లోకేష్ హాజరుకానున్నారు. అతిధులుగా నియోజకవర్గ సమన్వయకర్త అబద్ధయ్య, సీనియర్ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, తమ్మిశెట్టి జానకీదేవి, మండల పార్టీ అధ్యక్షులతో పాటు నియోజకవర్గంలోని అనుబంధ సంఘాల బాధ్యులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఇటీవల కాలంలో మంగళగిరి నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో పార్టీ కేడర్ తో లోకేష్ సమీక్షిస్తారు.