Nara Lokesh: మూడేళ్లుగా సైకోతో పోరాడుతున్నాం, సైకిల్ రావాల్సిందే - టీడీపీ నేతలతో నారా లోకేష్
పోలిట్ బ్యూరో, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ, బీసీ సాధికార సమితి సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన నారా లోకేష్ వారి అభిప్రాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు.
పాదయాత్రకు రెడీ అవుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు. పాదయాత్రకు అవసరం అయిన సూచనలు తీసుకుంటున్నారు. పోలిట్ బ్యూరో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంఛార్జ్ లు, పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, బీసీ సాధికార సమితి సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన నారా లోకేష్ వారి అభిప్రాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. యువ గళం పాదయాత్ర నిర్వహణ పై చర్చించారు. పాదయాత్రను పూర్తి స్దాయిలో సక్సెస్ చేస్తామని పార్టీ నేతలు లోకేష్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
సైకోపై పోరాడుతున్నాం - లోకేష్
మూడు సంవత్సరాలకు పైగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సైకోతో పోరాటం చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు, ప్రతిపక్షమూ కొత్త కాదన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరని, గతంలో ఎప్పుడూ ఇలాంటి సైకో పాలన చూడలేదని లోకేష్ వ్యాఖ్యానించారు. ఎన్నో ఇబ్బందులు పడినా పని చేస్తున్నారని కార్యకర్తలను అభినందించారు. కార్యకర్తలు, నాయకుల్ని వ్యక్తి గతంగా టార్గెట్ చేసి కేసులు పెట్టి వేధించారని, అయినా ఎక్కడా తగ్గేదే లేదంటూ వీరోచితకంగా పని చేస్తున్నారని అన్నారు. టీడీపీకి బలం కార్యకర్తలు, నాయకులేనని అన్నారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డిలా చేసుంటే వైఎస్ఆర్ సీపీ ఉండేది కాదన్నారు. ఆ పార్టీ నాయకులంతా ఇతర దేశాలకు పారిపోయేవారని వ్యాఖ్యానించారు. పసుపు జెండా కోసం ప్రాణం ఇచ్చే కార్యకర్తలు టీడీపీకి ఉన్నారని అన్నారు. ప్రజలంతా ఎన్నో ఆశలతో జగన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చారని, కానీ ఆయన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదన్నారు. 151 సీట్లు ప్రజలు ఇచ్చినందుకు ఎన్నో గొప్ప పనులు చెయ్యొచ్చన్నారు. కానీ జగన్ రెడ్డి కేవలం కక్ష సాధింపు కోసమే అధికారాన్ని వాడుకున్నారని చెప్పారు. ఏ వర్గం సంతోషంగా లేరని, జగన్ రెడ్డిపై ప్రజల్లో ద్వేషం కనిపిస్తుందని అన్నారు. మహిళలు, రైతులు, యువత, ఉద్యోగస్తులు ఆఖరికి పోలీసులు కూడా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని లోకేష్ చెప్పారు. జగన్ రెడ్డి దోపిడీ విచ్చలవిడిగా పెరిగిపోయిందని, లిక్కర్, సాండ్, మైనింగ్ మాఫియాలతో రాష్ట్రాన్ని, ప్రజల్ని దోచుకుంటున్నారని చెప్పారు. ప్రజలపై భారాన్ని విపరీతంగా పెంచారని, కరెంట్ ఛార్జీలు, నిత్యావసర సరకుల ధరలు, ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేశారని గుర్తు చేశారు.
సొంత పార్టీలో కూడా వ్యతిరేకతే..
వైసీపీ నాయకుల్లో, కార్యకర్తల్లో జగన్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందని చెప్పారు. అందుకే ఈ మధ్య మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు జగన్ రెడ్డి చెత్త పరిపాలన గురించి విమర్శిస్తున్నారని అన్నారు. వార్ ఒన్ సైడ్ అయిపొయిందని, ప్రజలంతా మన వైపు ఉన్నారని అన్నారు. సైకో పాలన పోయి సైకిల్ పాలన రాబోతుందని వివరించారు. దీని కోసం మనం అంతా ఇంకా ప్రజలకు మరింత దగ్గర అవ్వాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇప్పటికే బాదుడే బాదుడు.. ఇదేం ఖర్మ లాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లామని, మీ అందరికి ఆశీస్సులతో త్వరలో యువగళం పాదయాత్ర చేపట్టబోతున్నానని తెలిపారు. యువతని జగన్ మోసం చేసి, 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తానని వంచించాడని ఫైర్ అయ్యారు.
ప్రజా సమస్యలపై పోరాటం
ప్రజా సమస్యలపై పోరాడటానికి జాతీయ ప్రధాన కార్యదర్శి యువ గళం పాదయాత్ర ప్రారంభిస్తున్నారని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. పార్టీ యంత్రాంగం మొత్తం యువ గళం యాత్ర విజయవంతం అయ్యేలా కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. మూర్ఖుడి పాలనలో ప్రజలు నలిగిపోతున్నారని, రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పథంలో నడవాలి అంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు.