RK Roja: ఏపీలో ‘ఆడుదాం ఆంధ్రా’ - 51 రోజుల్లో 3 లక్షల మ్యాచ్‌లు, కీలక వివరాలు చెప్పిన మంత్రి రోజా
Andhra News: క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి ‘ఆడుదాం ఆంధ్రా' ప్రోమో, బ్రోచర్ ను ఆవిష్కరించారు.
Minister RK Roja News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువత కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమ వివరాలను తెలియజేస్తూ క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి ‘ఆడుదాం ఆంధ్రా' ప్రోమో, బ్రోచర్ ను ఆవిష్కరించారు. శుక్రవారం విజయవాడలోని ఇందిరా గాంధి స్టేడియంలో శాప్ కార్యాలయంలో శుక్రవారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి రోజా మాట్లాడుతూ.. ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం యువత ప్రతిభను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రోత్సహించేందుకు సిద్ధం చేసిన వేదికే 'ఆడుదాం ఆంధ్రా' అని పేర్కొన్నారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా 51 రోజుల్లో 3 లక్షల మ్యాచ్ లు, అంటే 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.5 లక్షల మ్యాచ్ లు, 680 మండలాల్లో 1.42 లక్షల మ్యాచ్ లు, 175 నియోజకవర్గాల్లో 5,250 మ్యాచ్ లు, 26 జిల్లాల్లో 312 మ్యాచ్ లు, రాష్ట్రస్థాయిలో 250 మ్యాచ్ లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
క్రీడల్లో ఆడపిల్లలు ఆడుపులులుగా: మంత్రి రోజా
"క్రీడా మంత్రిగా నా జీవితంలో ఇదొక సంతోషకరమైన రోజు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ సీఎం ఆడుదాం ఆంధ్రా వంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు. క్రీడల పట్ల ఆసక్తి,యువత పై నమ్మకం ఉన్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి .చరిత్రలో కనీవినీ ఎరుగని కార్యక్రమం ఇది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలను కార్యరూపం దాల్చడంలో మేం అదృష్టవంతులం. 72 గంటల్లో 5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంతమంచి అవకాశం మళ్లీ వస్తుందో లేదో ...ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి. కోటి మంది వరకూ రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారని భావిస్తున్నాం. ఏపీని ఆటల ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనేదే జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం. ఆడపిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొనాలి" అని మంత్రి రోజా పిలుపునిచ్చారు.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయిలో 51 రోజుల పాటు క్రీడా సంబరం సాగనుందని మంత్రి రోజా పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ యుగంలో 15 ఏళ్లు నిండిన యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే వారి ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతోనే ముందుకు సాగుతున్నమని, యువత క్రీడల ప్రాముఖ్యతను తెలుసుకోవాలనేదే ప్రభుత్వం ప్రధానలక్ష్యమని అన్నారు. డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 3 వరకూ టోర్నమెంట్ జరగుతాయని తెలిపారు.మొత్తం 5 క్రీడాంశాల్లో క్రికెట్,వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడల్లో పోటీలు జరుగుతాయన వెల్లడించారు. ఏ రాష్ట్రంలోనూ ఎవరూ చేయలేనంతగా సీఎం జగన్ పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రస్థాయిలో క్రీడలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. రెండేళ్లు కోవిడ్ కారణంగా ఎంతో నష్టపోయామని అయినా చంద్రబాబులాగా భయపడి జగన్ మోహన్ రెడ్డి పారిపోలేదని ప్రతి ఒక్కరికి అన్ని విధాలా న్యాయం చేస్తున్నారని అన్నారు. సంక్షేమంతో పాటు అన్నీ అందరికీ అందేలా చేస్తున్న ఒకే ఒక్కరు జగన్ అని ఉద్ఘాటించారు.
"ఆడుదాం ఆంధ్రా" రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద క్రీడా సంబరం: SAAP ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్
రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడే వస్తారనే అభిప్రాయం ప్రజల్లో ఉండేదని, కానీ సీఎం జగన్ ఏపీలో ఒక ట్రెండ్ ను సృష్టించారని శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచి ప్రతీ నాయకుడిని నిత్యం జనాల్లో ఉండేలా చూశారని చెప్పారు. ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద క్రీడా సంభరమని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటి సారి ఈ ముందడుగు వేసింది జగన్ మాత్రమే స్పష్టం చేశారు. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సుమారు కోటి మంది రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారని అంచనా వేస్తున్నామనిచెప్పారు. ఆడుదాం ఆంధ్రాను యువత వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.