Perni Nani: చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ టెంట్ హౌస్ పార్టీ - మంత్రి పేర్ని నాని ఎద్దేవా
పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. మచిలీపట్నంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ అనే ఆయన చంద్రబాబుకు సాయం చేయడం కోసమే రాజకీయాలు చేస్తుంటారని ఎద్దేవా చేశారు. 2014లో పార్టీ పెట్టె సమయంలోనే పవన్ కళ్యాణ్ కి బలం లేదని తెలుసని అన్నారు. 2019లోనూ పవన్ కల్యాణ్ కి బలం లేదని, అప్పుడు చంద్రబాబుతో అలాంటి ఒప్పందం ఎందుకు చేసుకోలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఎందుకు చంద్రబాబుతో కలుస్తున్నారని అడిగారు. మచిలీపట్నంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
2019లో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేక ఓటు వైఎస్ఆర్ సీపీకి వెళ్లకుండా ఆపడానికి ఇద్దరు కుట్ర చేసి విడివిడిగా పోటీ చేశారని విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబుతో కలిసి నేరుగా పోటీ చేస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు అవసరం వచ్చినప్పుడల్లా టెంట్ హౌస్ మాదిరిగా పవన్ కల్యాణ్‌ను వినియోగించుకుంటున్నారని అన్నారు.
జనసేన కోసం ఊళ్లలో తిరుగుతున్న కుర్రాళ్లని చూస్తే జాలేస్తోంది. సొంత రాజకీయాలు చేయలేని పవన్ కల్యాణ్ కోసమా ఈ యువత తాపత్రయపడుతోంది? ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేస్తే ప్రజలు నమ్ముతారు. చిత్తశుద్ధితో రాజకీయాలు చేస్తే సీట్లు సంపాదించుకోవచ్చు. సినిమాల మధ్యలో గ్యాప్‌లో వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం వ్యాన్ కొని దానికి వారాహి అని పేరు పెట్టి హడావుడి చేసి దాన్ని దాచేశారు’’ అని మంత్రి పేర్ని నాని అన్నారు.
పొత్తుపై క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్
జనసేన పార్టీ మండల, పట్టణ, డివిజన్ అధ్యక్షులతో పవన్ కల్యాణ్ సమావేశం అయిన సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పొత్తు గురించి స్పష్టత ఇచ్చారు. జనసేన పార్టీ త్రిముఖ పోటీలో బలి కావడానికి సిద్ధంగా లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇంకోసారి తాను ఓడిపోవడానికి కూడా రెడీగా లేనని అన్నారు. కచ్చితంగా పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. అంతా గౌరవంగా ఉండి, అన్ని పద్ధతులు బావుంటే కచ్చితంగా జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అవుతామా లేదా అనేది ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చాక సంగతి అని అన్నారు. అంత బలమైన మెజారిటీ ఇచ్చి, మనం పోటీ చేసిన స్థానాల్లో అత్యధిక ఓట్లు వస్తే మనం మాట్లాడేందుకు హక్కు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ప్రత్యర్థిని దించడమే తన ప్రైమరీ టార్గెట్ అని అన్నారు.
పొత్తు పెట్టుకోవడం అనేది పార్టీ ఎదుగుదలకు తోడ్పడుతుందని, దాన్ని తక్కువ అంచనా వేయవద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాను ఎమ్మెల్యేలను ఇవ్వలేనప్పుడు సీఎం పదవి అడగలేనని అన్నారు. పొత్తులో ముఖ్యమంత్రి పదవి అనేది ఫలితాల తర్వాత బలాబలాలు, సమీక్షలు చేసి అప్పుడు నిర్ణయించేదని అన్నారు. ప్రస్తుతం ముందున్న లక్ష్యం వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి, కూటమిని గద్దె ఎక్కించడం అని చెప్పారు.