Nara Lokesh: విద్యాదీవెన, వసతిదీవెన బకాయిల వివరాలివ్వండి! - మంత్రి లోకేష్ ఆదేశం
AP Latest News: నారా లోకేష్ ఉండవల్లిలోని నివాసంలో ఉన్నత విద్య శాఖ ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు. వివిధ నివేదికలు అందించాలని అధికారులను కోరారు.

Nara Lokesh Latest News: రాష్ట్రవ్యాప్తంగా విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలను సమర్పించాలని రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో ఉన్నత విద్య శాఖ ముఖ్య అధికారులతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... తాను పాదయాత్ర నిర్వహించిన సమయంలో వేలాది విద్యార్థులు ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల తమ సర్టిఫికెట్లు కళాశాలల్లోనే నిలిచిపోయాయని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
2018-19 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్ల వివరాలు, ఎప్ సెట్ లో ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజి ఏమేరకు ఇవ్వాలి, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులు ఏమేరకు ఉండాలనే విషయమై కూడా నోట్ సమర్పించాలని లోకేష్ కోరారు. ఉన్నత విద్యాసంస్థల్లో ఖాళీలు, రిక్రూట్ మెంట్ చేయాల్సిన ఫ్యాకల్టీ వివరాలు, రాష్ట్రవిభజనలో ఉన్నత విద్యకు సంబంధించిన పెండింగ్ అంశాలు, లెర్నింగ్ మ్యానేజ్ మెంట్ సిస్టమ్ ఫలితాలు ఎలా ఉన్నాయి అనే అంశాలపై పూర్తిస్థాయి నివేదికలు అందజేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో బుధవారం లోగా అధికారులు ఆయా నివేదికలు సమర్పిస్తే... తాము అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య తగ్గడం పై కూడా రిపోర్ట్ సబ్మిట్ చెయ్యాలని లోకేష్ అధికారులను కోరారు.
యూనివర్సిటీల ర్యాంకింగ్స్ పడిపోవడానికి గల కారణాలు అధ్యయనం తిరిగి పూర్వవైభవం తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యల పై రిపోర్ట్ ఇవ్వమని కోరారు. వివాదాస్పద వీసీలు, యూనివర్సిటీల్లో జరిగిన అవినీతి ఆరోపణలపై కూడా తనకి సమగ్ర వివరణ కావాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఉన్నతవిద్య ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు, కమిషనర్ పోలా భాస్కర్, ఆర్ జెయుకెటి రిజిస్ట్రార్ ఎస్ఎస్వి గోపాలరాజు, ఎపి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఛార్జి చైర్మన్ కె.రామ్మోహన్ రావు, ఎపి హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ కార్యదర్శి సూర్యచంద్రరావు, ఎపి ఆర్చివ్స్ డైరక్టర్ వి.రంగరాజ్, తెలుగు, సంస్కృత అకాడమీ ప్రాజెక్టు డైరక్టర్ పి.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

