Pinnelli Ramakrishna Reddy: హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లి అత్యవసర పిటిషన్ - కాసేపట్లో విచారణకు ఛాన్స్!
Macherla News: అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఎమ్మెల్యే పిన్నెల్లి ఆచూకీని పోలీసులు గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం లేదు. ఆయన్ను అరెస్టు చేయాలని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే.
![Pinnelli Ramakrishna Reddy: హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లి అత్యవసర పిటిషన్ - కాసేపట్లో విచారణకు ఛాన్స్! Macherla MLA Pinnelli Ramakrishna reddy went to AP High Court seeking anticipatory bail Pinnelli Ramakrishna Reddy: హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లి అత్యవసర పిటిషన్ - కాసేపట్లో విచారణకు ఛాన్స్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/23/fbfd96ea93c458240f78098d14f90dd41716462712594234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pinnelli Ramakrishna Reddy News: వివాదాల్లో చిక్కుకుని పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో ఆయన తరపు న్యాయవాదులు అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. కాసేపట్లో ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వస్తుందని తెలుస్తోంది. పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డి లాయర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆయన్ను ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్టు చేయడం సరికాదని అన్నారు. ఎన్నికలు సంఘం కూడా ఎమ్మెల్యేను అరెస్టు చేయాలని ఆదేశించడం కరెక్టుకాదని అన్నారు
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు. ఈ వీడియో కూడా బయటికి వచ్చి విపరీతంగా వైరల్ అవుతోంది. ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనను ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే ఈవీఎంల ధ్వంసం కేసులో ఎమ్మెల్యేను అరెస్టు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అంతకుముందే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పిన్నెల్లిని.. పోలీసులు అరెస్టు చేసేందుకు ఎంత ప్రయత్నించినా ఆయన ఆచూకీ లభ్యం కావడం లేదు.
లుకౌట్ నోటీసులు
దీంతో పోలీసులు పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. గత రెండు రోజుల నుంచి ఎమ్మెల్యే పిన్నెల్లి ఆచూకీ దొరకడం లేదు. ఏపీ పోలీసులు వివిధ టీమ్‌లుగా ఏర్పడి ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణలోని సంగారెడ్డి ప్రాంతంలో ఉన్నట్లుగా తెలియగా.. అక్కడ తెలంగాణ పోలీసుల సహకారంతో పిన్నెల్లి కారును, డ్రైవర్‌ను బుధవారం (మే 22) అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు, మే 22న సాయంత్రం పిన్నెల్లి సంగారెడ్డి వద్ద ఓ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్ లో తలదాచుకున్నారని, ఆయన్ను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారని ప్రచారం కూడా జరిగింది. కానీ అరెస్టు చేయలేదని త్వరలో పట్టుకుంటామని పోలీసులు ధ్రువీకరించారు. పిన్నెల్లి విదేశాలకు పారిపోయారని లేదా మరో రాష్ట్రానికి వెళ్లిపోయి ఉంటారని కూడా ప్రచారం జరిగింది. చివరికి నేడు పిన్నెల్లి ఆయన నర్సరావుపేట కోర్టులో లొంగిపోతారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ కోర్టు వద్ద పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. తాజాగా పిన్నెల్లి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)