కాసేపట్లో ఇప్పటం గ్రామానికి పవన్ కల్యాణ్- కంచెలతో రెడీగా ఉన్న పోలీసులు- ఏం జరుగనుంది?
అక్రమ కట్టడాల పేరుతో ఇప్పటం గ్రామంలో శుక్రవారం(నవంబర్ 4, 2022) అధికారులు హడావుడి చేశారు. కోర్టు ఆదేశాలు వచ్చే వరకు రోడ్డు విస్తరణకు కొన్ని ఇళ్లను కూల్చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాసేపట్లో మంగళగిరి నియోజకవర్గం ఇప్పటంలో పర్యటించనున్నారు. ఇది మరోసారి రాజకీయంగా కాక రేపే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. పవన్ పర్యటన అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నట్టు జనసేన ఆరోపిస్తోంది. అందుకే సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతోంది.
అక్రమ కట్టడాల పేరుతో ఇప్పటం గ్రామంలో శుక్రవారం(నవంబర్ 4, 2022) అధికారులు హడావుడి చేశారు. కోర్టు ఆదేశాలు వచ్చే వరకు రోడ్డు విస్తరణకు కొన్ని ఇళ్లను కూల్చేశారు. ఇది రాజకీయంగా పెను దుమారాన్ని రేపింది. జనసేన, బీజేపీ, టీడీపీ దీనిపై మండిపడ్డాయి.
గతంలో పవన్ కల్యాణ్ సభకు భూములు ఇచ్చిన కారణంగానే అధికార పార్టీ ఇప్పటంపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని జనసేనతోపాటు విపక్షాలన్ని మండిపడ్డాయి. అక్కడ ప్రజలకు భరోసా ఇచ్చేందుకు పవన్ కల్యాణ్ టూర్ పెట్టుకున్నారు. ఇదే ఇప్పుడు అమరావతి ఏరియాలో కాకా పుట్టిస్తోంది.
ఇప్పటం గ్రామానికి చేరుకోనున్న పవన్ కల్యాణ్ ప్రజలతో మాట్లాడనున్నారు. కూల్చేసిన ఇళ్లను పరిశీలించనున్నారు. పవన్ పర్యటనకు వస్తున్న వేళ... ఇప్పటం గ్రామాన్ని పోలీసులు చుట్టుముట్టారు. వేరే ప్రాంతం వాళ్లు అక్కడకు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ బందోబస్తు రెడీ చేశారు. వైఎస్ విగ్రహాలకు పూర్తిగా రక్షణ కంచెను ఏర్పాటు చేశారు.
పోలీసులు తీసుకుంటున్న చర్యలపై జనసేన అనుమానం వ్యక్తం చేస్తోంది. పవన్‌ను ఇప్పటం వెళ్లనీయకుండా చేస్తారేమో అన్న సందేహపడుతోంది. అందుకే మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌తోపాటు అన్ని ప్రాంతాల్లో పోలీసులు మోహరించారని ఆరోపిస్తోందా పార్టీ. ఇప్పటికే దారి పొడవున కంచెలు వేశారని ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతోంది.
అసలేం జరిగింది
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో అధికారులు ఇళ్లు కూల్చి వేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారని వైసీపీ నేతలు కక్ష సాధిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దాదాపు 100 ఇళ్లు కూల్చివేస్తామని అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ ఇళ్లు జనసేన మద్దతుదారులవి అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటం గ్రామం జనసేన ఇన్ ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. గ్రామస్థులు జనసేనకు మద్దతుగా నిలవడంతో ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన సభకు స్థలం ఇచ్చిన సమయంలో స్థానిక ఎమ్మెల్యే ఇప్పటం గ్రామానికి హెచ్చరికలు వచ్చాయని ఆరోపించారు.