జాతీయ మీడియా అవార్డులు-2022 నామినేషన్లకు భారత ఎన్నికల సంఘం ఆహ్వానం
జాతీయ మీడియా అవార్డులు-2022 కోసం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. నాలుగు ప్రధాన కేటగిరీల్లో పురస్కారాలు అందిస్తారు.
జాతీయ మీడియా అవార్డులు-2022 నామినేషన్లకు భారత ఎన్నికల సంఘం ఆహ్వానం పలికింది. ఓటు హక్కుపై ఓటర్లలో చైతన్యం, అవగాహనపై ఉత్తమ ప్రచారానికి అవార్డులు ఇవ్వనున్నారు. ప్రింట్, టెలివిజన్, రేడియో, ఆన్‌లైన్/సోషల్ మీడియా విభాగాలు మొత్తం 4 కేటగిరీల్లో అవార్డులు ఉంటాయి. నామినేషన్లకు చివరి తేది 30 నవంబర్, 2022. అవార్డులను 25 జనవరి 2023న ప్రదానం చేస్తారు.
జాతీయ మీడియా అవార్డులు-2022 కోసం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై నాలుగు ప్రధాన కేటగిరీల్లో ఈ పురస్కారాలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. అవార్డుల కోసం ఎంట్రీలు పంపించాల్సిందిగా భారత ఎన్నికల సంఘం ఆహ్వానిస్తోందని పేర్కొన్నారు. ఓటు హక్కు వినియోగంపై ఓటర్లలో చైతన్యం నింపడం, అవగాహన కల్పించే విషయంలో విశేష కృషి చేసిన ఉత్తమ ప్రచార మాధ్యమాలకు జాతీయ మీడియా అవార్డుల్ని ప్రదానం చేసేందుకు భారత ఎన్నికల సంఘం నామినేషన్లు ఆహ్వానిస్తోంది. 2012 నుంచి చేసిన కృషిని పరిగణలో తీసుకుని ఈ అవార్డులు ఇవ్వనున్నట్టు తెలిపారు.
ప్రింట్, ఎలక్ట్రానిక్ (టెలివిజన్), ఎలక్ట్రానిక్ (రేడియో), ఆన్ లైన్ (ఇంటర్నెట్)/సోషల్ మీడియా విభాగాలు మొత్తం 4 కేటగిరీల్లో అవార్డులు ఇవ్వనున్నారు. నవంబర్ 30 తేదీలోగా ఎంట్రీలను భారత ఎన్నికల సంఘానికి పంపించాలి. 2023 జనవరి 25వ తేదీన జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవం నాడు ఉత్తమ మీడియా సంస్థలకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డులో భాగంగా సైటేషన్, పత్రం, నగదు ప్రొత్సాహకం ప్రదానం చేస్తారని తెలిపారు. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ఓటర్లను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేందుకు, ఓటు హక్కు వినియోగంపై చైతన్యం కల్పించేందుకు, ఓటరు నమోదు, రిజిస్ట్రేషన్ వంటి అంశాల్లో విశేష కృషి చేసిన మీడియా సంస్థలకు ఈ అవార్డులు అందించనున్నారు.
భారత ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ప్రత్యేక జ్యూరీ మాధ్యమాలు నిర్వహించిన క్వాలిటీ ఆఫ్ ఓటర్ అవేర్‌నెస్ క్యాంపెయిన్, ఎక్స్లెంట్ ఆఫ్ కవరేజ్ అండ్ క్వాంటిటీ, ఓటరు అవగాహనా కార్యక్రమాలు తదితర అంశాల ఆధారంగా ఉత్తమ ఎంట్రీల్ని ఎంపిక చేసి పురస్కారాలు అందిస్తారు. ఎంట్రీలకు సంబంధించి ప్రింట్ మీడియా న్యూస్ ఆర్టికల్స్ వివరాలు సాఫ్ట్ కాపీ పీడీఎఫ్ లేదా న్యూస్ పేపర్ ఆర్టికల్ ఫుల్‌సైజ్ ఫోటో కాపీ లేదా ప్రింట్ కాఫీ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. బ్రాడ్‌కాస్ట్ టెలివిజన్ లేదా రేడియోలైతే క్యాంపెయిన్‌కు సంబంధించిన సీడీ లేదా డీవిడీ లేదా పెన్‌డ్రైవ్ ద్వారా వివరాలు సమర్పించాలి. స్పాట్‌న్యూస్ వివరాలు, న్యూస్ ఫీచర్ లేదా ప్రోగ్రామ్‌లకు సంబంధించి సీడి లేదా డివిడి లేదా పెన్‌డ్రైవ్ ద్వారా టెలీకాస్ట్ అయిన వ్యవధి, సమయం, తేదీ, ఫ్రీక్వెన్సీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ లేదా సోషల్ మీడియా ఎంట్రీలు పంపించేవారు ఓటర్ల అవగాహనకు సంబంధించి నిర్దేశిత సమయంలో చేసిన పోస్టులు, బ్లాగ్స్, క్యాంపెయిన్ లేదా ట్వీట్స్ లేదా ఆర్టికల్స్ వివరాల్ని పంపించాల్సి ఉంటుంది.
ఓటర్లలో చైతన్యం, అవగాహనపై జాతీయ మీడియా అవార్డ్స్ 2022కు (National Media Awards 2022) ఎంట్రీలు పంపించేవారు హిందీ, ఇంగ్లీషు తప్ప మిగిలిన భాషలకు ఇంగ్లీష్ అనువాదం పంపించాలి. ప్రతి ఎంట్రీకు తప్పనిసరిగా మీడియా హౌస్ పేరు, అడ్రస్, టెలీఫోన్ నంబర్, ఫ్యాక్స్ నెంబర్లు, ఈ మెయిల్ ఉండాలి. ఎంట్రీలను లవ్ కుష్ యాదవ్, అండర్ సెక్రటరీ కమ్యూనికేషన్స్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నిర్వాచన్ సదన్, అశోక్ రోడ్, న్యూఢిల్లీ-110001కు పంపించాలి. ఈ-మెయిల్ media-division@eci.gov.in లేదా 011-23052033 ఫోన్ నెంబర్‌ను సంప్రదించాల్సి ఉంటుందని ఆయన వివరించారు.