Dasara 2022: ఏపీలో దసరా ఉత్సవాలు, దుర్గమ్మ సన్నిదిలో మెదలైన పొలిటికల్ వార్
తాజా, మాజీ మంత్రుల మధ్య వివాదంగా ప్రచారం జరుగుతోంది. బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరగనున్న దసరా ఉత్సవాల్లో అప్పుడే పొలిటికల్ వార్ మెదలైంది.
బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరగనున్న దసరా ఉత్సవాల్లో అప్పుడే పొలిటికల్ వార్ మెదలైంది. పొలిటికల్ వార్ అంటే అలాంటి ఇలాంటిది కాదు. ఏకంగా తాజా, మాజీ మంత్రుల మధ్య వివాదంగా ప్రచారం జరుగుతోంది. దేవస్థానం తన పరిధిలో ఉండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దేవాదాయ శాఖ మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు, ఇప్పుడున్న దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యానారాయణపై అజమాయిషీ చేస్తున్నారని ప్రచారంలో ఉంది. ఇందుకు కారణాలు కూడా ఉన్నాయి.
సామాన్య భక్తులకు మంత్రి కొట్టు అధిక ప్రాధాన్యత
ఈసారి బెజవాడలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం పైనే దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యానారాయణ, ప్రత్యేకంగా దృష్టి సారించారు. అంతే కాదు అమ్మవారి ఆదాయం పెంచేందుకు ఎవరికయినా సరే 500 రూపాయల టిక్కెట్ ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. అన్నింటికి మించి టీటీడీ తరహాలో బ్రేక్ దర్శనం అమలు చేయాలని ప్రతిపాదనలు కూడ రెడీ చేశారు. ప్రధానంగా అమ్మవారి దర్శనం తరువాత బయటకు వచ్చే భక్తుల కోసం మూడు రకాల ప్రసాదాలను సిద్ధం చేసి పంపిణీ చేయాలని కూడా నిర్ణయించి, ప్రతిపాదనలు రెడీ చేశారు. అయితే ఇవి ఇప్పటికిప్పుడు అమలు చేయటం సాధ్యం కాదంటూ దేవస్థానం అధికారులు సదరు దస్త్రాలను ముందుకు వెళ్లనీయకుండా అడ్డుపడ్డారని ప్రచారం ఉంది. అయితే ఎకంగా దేవాదాయ శాఖ మంత్రి ఆదేశాలు ఇచ్చినప్పటికి పాలనా పరమైన అంశాలకు చెందిన దస్త్రాలను సిద్దం చేయకుండా అధికారులు సిబ్బంది అడ్డుపడే పరిస్థితులు అంత ఈజీగా లేవు. ఇక్కడే మరో అంశం కూడా తెర మీదకు వచ్చింది. ఎమ్మెల్యేలకు చెందిన సిఫార్సు లేఖలు వచ్చిన వారికి అమ్మవారికి దర్శనానికి కేవలం అయిదుగురిని అనుమతించటంతో పాటుగా, ఒక్కో మనిషికి 500 రూపాయలు టిక్కెట్ ను వసూలు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ నిర్ణయం తీసుకొని అమలు చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
ప్రతిపాదనల అమలుకు అడ్డు చెబుతున్న వెల్లంపల్లి !
స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న దేవాదాయ శాఖ మాజీ మంత్రి వెలంపల్లి ఈ ప్రతిపాదనల అమలుకు అడ్డు చెబుతున్నారని, అందులో భాగంగానే అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో దేవస్థానం ఉద్యోగులు, అధికారులు కూడా చేతులు ఎత్తేశారని అంటున్నారు. స్వయంగా దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాలు ఇచ్చినా వాటిని అమలు చేయకపోవటానికి కారణాలు కూడా ఉన్నాయి. దసరా ఉత్సవాలకు భక్తుల తాకిడి భారీగా ఉంటుంది. సిఫార్సు లేఖలే ఉత్సవాల్లో చక్రం తిప్పుతాయి. ఇక ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో వచ్చిన వారికి కూడా టిక్కెట్ వసూలు చేయటంపై స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని పార్టీ వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే, స్థానిక ఎమ్మెల్యేలుగా ఉన్న ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కూడా భక్తుల నుండి ఒత్తిడి ఉంటుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు నుండి కూడా సిఫార్సులు అధికంగా ఉండే పరిస్థితుల్లో అందరికీ టిక్కెట్ తీసుకొని దర్శనం చేయించటంపై ఎమ్మెల్యే వెలంపల్లి అభ్యంతరం తెలిపారని అంటున్నారు. దీంతో తాను తీసుకున్న నిర్ణయాలు ఒక్కటి కూడా దసరా ఉత్సవాల్లో అమలు కావడం లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే హోం మంత్రిని తీసుకువచ్చి, ఎమ్మెల్యే వెలంపల్లి దసరా ఉత్సవాల ఏర్పాట్లుపై పరిశీలన జరిపించారని అంటున్నారు. అయితే ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యానారాయణకు కనీసం సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. దసరా ఉత్సవాలపై జరిగే సమీక్షలో కూడా వెలంపల్లి అన్నీ తానై నడిపించారనే ప్రచారం జరుగుతోంది.