CM Jagan Davos Tour: తొలిసారి దావోస్ సదస్సుకు సీఎం జగన్, ప్రధాని మోదీ కూడా - సమర్థతకు పరీక్షేనా?
సీఎంతో పాటు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఉన్నతాధికారులు ఈ పర్యటనకు వెళ్లనున్నారు.
CM Jagan Davos Tour: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో తొలిసారిగా దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సారి ఇదే సదస్సుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో పాటుగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన సీఎంలు, మంత్రులు హాజరు అవుతున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏటా దావోస్ లో జరిగే సదస్సుకు హాజరయ్యే వారు. దావోస్ కేంద్రంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం అయ్యేవారు. ఆ సమయంలో దాని గురించి పెద్ద ఎత్తున ప్రచారం సాగేది. ఇప్పుడు సీఎం హోదాలో తొలిసారి సీఎం జగన్ పెట్టుబడుల సదస్సుకు వెళ్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఈ పర్యటన సీఎం జగన్, మంత్రి సమర్థతకు పరీక్షగా మారనుంది.
మే 22 నుంచి మే 26 వరకూ దావోస్ పర్యటన
ఈ నెల 22 నుంచి మే 26 వరకు సీఎం జగన్ రెడ్డి దావోస్ పర్యటన ఉండనుంది. సీఎంతో పాటు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఉన్నతాధికారులు ఈ పర్యటనకు వెళ్లనున్నారు. దావోస్ లో జరగబోయే దావోస్ ఎకనామిక్ ఫోరమ్ లో వందల సంఖ్యలో కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ సదస్సులో కోవిడ్ ముందు ఉన్న పరిశ్రమల పరిస్థితి కోవిడ్ తర్వాత పరిస్థితిపై చర్చ జరుగుతుంది. రాబోయే కాలంలో పారిశ్రామిక మార్పులపైన కూడా చర్చ జరగనుంది.
‘‘పెద్ద పెద్ద కంపెనీలు ఎకనామిక్ ఫోరమ్ లో పాల్గొంటాయి. ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా ఎన్ని కోట్ల పెట్టుబడులు వస్తాయి అనే అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. ఎకనామిక్ ఫోరమ్ అనేది పెద్ద కంపెనీలు పారిశ్రామిక ప్రగతిపై చర్చించే వేదిక. సహజంగానే ఏపీ పారిశ్రామిక స్థితిగతులపై చర్చ జరుగుతుంది. 22 నుంచి 26 వరకు జరిగే దావోస్ పర్యటనతోనే పెట్టుబడులు రావు. రాష్ట్ర ప్రభుత్వం ఒక టీంతో ముందుకు వెళ్లి ఏపీకి రావాల్సిన పెట్టుబడులపై చర్చిస్తాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఛైర్మన్ తో కూడా సీఎం జగన్ చర్చిస్తారు.’’ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు.
దావోస్ పర్యటనలో నేపథ్యంలో ముఖ్యమంత్రి మూడు రాష్ట్ర స్థాయి సమావేశాలలో పాల్గొననున్నారు. ఈ నెల 23వ తేదీన వైద్య రంగంపై కీలక సమావేశం, 24న విద్య, నైపుణ్య రంగాలపై అత్యున్నత స్థాయి సమావేశం, 25వ తేదీన డీసెంట్రలైజ్డ్ ఆర్థిక వ్యవస్థ దిశగా మార్పుపై సమావేశం జరగనుంది.