Police Recruitment Relaxation: కానిస్టేబుల్ అభ్యర్థులకు తీపికబురు, సీఎం జగన్ కీలక నిర్ణయం
పోలీస్ రిక్రూట్‌మెంట్ విషయంలో రెండేళ్ల వయసును సడలిస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వయసు పరిమితి సడలింపునకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు.
పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ వయసు పరిమితి దాటిపోయిన వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీపి కబురు వినిపించారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ విషయంలో రెండేళ్ల వయసును సడలిస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వయసు పరిమితి సడలింపునకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు.
కానిస్టేబుల్ అభ్యర్థుల వినతి మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది. వాటిలో 411 ఎస్‌ఐ పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఎస్‌ఐ పోస్టుల్లో 315 సివిల్ (పురుషులు, మహిళల కేటగిరీలు), 96 ఏపీఎస్పీ (పురుషులు) పోస్టులు ఉన్నాయి. 6,100 కానిస్టేబుల్ పోస్టుల్లో 3,580 సివిల్, 2,520 ఏపీఎస్పీ పోస్టులు ఉన్నాయి. ఎస్‌ఐ పోస్టుకు రెండు విభాగాల్లో (సివిల్, ఏపీఎస్పీ) అప్లై చేసేవారికి ఒక దరఖాస్తు సరిపోనుంది.
పోలీసు ఉద్యోగాల భర్తీచేయాలంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు వీటి భర్తీ కోసం పోలీస్‌శాఖ అక్టోబరు 20న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 22న కానిస్టేబుల్ అభ్యర్థులకు, ఫిబ్రవరి 19వ తేదీన సబ్ ఇన్‌స్పెక్టర్ అభ్యర్థులకు ప్రిలిమినరీ రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పోస్టుల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో హోంగార్డులకు 15 శాతం రిజర్వేషన్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టుల్లో హోం గార్డులకు 25 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల్లో మహిళలకు 33.33 శాతం పోస్టులను కేవలం సివిల్ విభాగంలో కేటాయించారు.
ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి స్థాయి పరీక్షకు అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్ పరీక్షకు హాజరు కావడానికి వీలుంటుంది. ఇది మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు కలిగి ఉన్న పరీక్ష. దీనిలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి. అన్ని స్టేజీలు దాటుకొని ఎంపికైన అభ్యర్థులకు 2023 జూన్‌లో పోలీసు శిక్షణ ప్రారంభిస్తారు. ట్రైనింగ్ పూర్తయ్యాక 2024 ఫిబ్రవరి ప్రారంభం నాటికి పోలీసు శాఖలో పోస్టింగ్ ఇవ్వనున్నారు.
రాష్ట్రంలో పోలీసు శాఖలో పెద్ద ఎత్తున పదవీ విరమణలు జరగడం.. కొన్ని పోస్టులకు ప్రమోషన్లు ఇస్తూ ఉండడంతోపాటు సర్వీస్‌లో కొందరు పోలీసులు మరణించడంతో భారీ ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీలకు తోడు పోలీసులకు వీక్లీ ఆఫ్ కూడా అమలు చేస్తుండడంతో సిబ్బంది కొరత ఏర్పడుతోంది. దీంతో తక్షణమే కొత్త పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
పోస్టుల వివరాలిలా..
సివిల్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులు (మెన్ అండ్ ఉమెన్) - 315
ఏపీఎస్పీ రిజర్వ్ ఎస్సై పోస్టులు - 96
మొత్తం ఎస్సై పోస్టుల సంఖ్య - 411
సివిల్ కానిస్టేబుల్ పోస్టులు (మెన్ అండ్ ఉమెన్) - 3580
ఏపీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు - 2520
మొత్తం పోస్టులు - 6,100