AP MLC Elections: ఆ 16 మంది వైసీపీ ఎమ్మెల్యేల ఓటు టీడీపీకే - గోరంట్ల, నిమ్మల కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద అసంతృప్తితో 16 మంది వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరిపారని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
ఏపీలో నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న వేళ టీడీపీ ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొంత మంది వైఎస్ఆర్ సీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, వారు టీడీపీకే ఓటు వేస్తారని మాట్లాడారు. టీడీపీ అభ్యర్థి విజయం ఖాయమని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ పట్ల అసహనంగా ఉన్నారు కాబట్టి, 16 మంది వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తున్నారని అన్నారు.
బాధలో ఉన్నామని చెబుతున్నారు - గోరంట్ల బుచ్చయ్య చౌదరి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద అసంతృప్తితో 16 మంది వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరిపారని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆ పార్టీ నుంచి ఫిరాయింపులు మొదలయ్యాయని అన్నారు. తాము బాధలో ఉన్నామని, మీతో పంచుకుంటున్నామని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తమతో చెప్పారని గుర్తు చేశారు. తాము ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వలేదని, వారు వారి అంతరాత్మ ప్రభోదానుసారమే ఓటు వేస్తారని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ 16 మంది వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మూడు ప్రాంతాల వారు అని చెప్పారు.
అలా చేస్తేనే జగన్ మారతారని అనుకుంటున్నారు - నిమ్మల రామానాయుడు
టీడీపీ పోలింగ్ ఏజెంట్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలోనూ తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అంతరాత్మ ప్రభోదానుసారం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తమకు ఓటు వేయబోతున్నారని అన్నారు. వైఎస్ఆర్ సీపీలో అసంతృప్తితో ఉన్న 16 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్‌లోనే ఉన్నారని అన్నారు. పట్టభద్రుల ఎన్నిక తర్వాత వైఎస్ఆర్ సీపీ మునిగిపోయే పడవ అని సొంత పార్టీ ఎమ్మెల్యేలే గ్రహించారని అన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఝలక్ ఇస్తేనే జగన్ మారతాడనే భావనలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. సీక్రెట్ ఓటింగ్‌లో ఎవరు ఎవరికి వేశారో తెలిసే అవకాశమే లేదని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.
నేడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మొత్తం ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడుగురు వైఎస్ఆర్ సీపీ, ఒకరు టీడీపీ అభ్యర్థి బరిలో ఉన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారని ధీమాలో ఉన్నారు. ఉదయం 9 గంటలకు వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి అంతస్తులో ప్రారంభమైంది. తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కూడా ఓటు వేయనున్నారు. ఇందుకోసం ఆయన నేడు ఏపీ అసెంబ్లీకి రానున్నారు.