(Source: ECI/ABP News/ABP Majha)
Dulhan Scheme: దుల్హన్ స్కీమ్ ఇయ్యలేం- ఆర్థిక కష్టాలంటూ హైకోర్టులో జగన్ సర్కార్ కౌంటర్
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, రూ.లక్ష ఇస్తామని జగన్ ప్రతిపక్షంలో ఉండగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో పేద ముస్లిం మైనార్టీ యువతుల వివాహానికి ఆర్థిక సాయం చేసే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దుల్హన్ పథకానికి ప్రభుత్వం మంగళం పాడింది. దుల్హన్ పథకాన్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ దుల్హన్ పథకాన్ని నిలిపివేస్తున్నట్లుగా అధికారులు కోర్టుకు విన్నవించారు.
దుల్హన్ పథకం కింద పేద ముస్లిం మైనారిటీ యువతులకు పెళ్లి సందర్భంగా ప్రభుత్వం రూ.50 వేలు ఆర్థిక సాయం చేస్తూ వస్తోంది. ఇప్పటిదాకా రూ.50 వేలు ఆర్థికసాయం అందిస్తూ వచ్చింది. తాజాగా దీన్ని నిలిపివేసింది. దుల్హన్ పథకం ఎందుకు ఆపేస్తున్నారని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ల నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు స్పష్టం చేసింది.
పేద ముస్లిం యువతులకు వివాహం కోసం టీడీపీ హయాంలో రూ.50 వేలు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, రూ.లక్ష ఇస్తామని జగన్ ప్రతిపక్షంలో ఉండగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామిని అమలు చేసి దుల్హన్ పథకం అమలు చేయాలని, జగన్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేత షిబ్లి హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ గురువారం విచారణకు వచ్చిన సందర్భంగా సీనియర్ న్యాయవాది ఎస్ ఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఈ పథకం అమలకు తమ వద్ద డబ్బు లేదని ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది తేల్చి చెప్పారు. అఫిడవిట్లపై రిప్లై దాఖలు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని హై కోర్టు ఆదేశించింది.
అయితే రంజాన్ తోఫా కింద అప్పటి ప్రభుత్వం ముస్లింలకు పండగ నాడు అవసరం అయిన అన్ని సరుకులు అందించింది. అంతే కాదు రంజాన్ మాసం సందర్బంగా ఇఫ్తార్ విందులను భారీగా నిర్వహించి ముస్లింలకు అండగా ఉంటామనే సంకేతాలు ఇచ్చింది. కాని ఆ తరువాత పరిస్థితులు మారిపోయాయి. ఎన్నికలు వచ్చిన తరువాత ఎస్సీ,- ఎస్టీ బీసీ, వర్గాలతో పాటుగా ముస్లిం వర్గం కూడ జగన్ కు ప్రాదాన్యం ఇచ్చారనేది స్పష్టం అయ్యింది. అందులో భాగంగానే జగన్ ప్రభుత్వం కూడా ముస్లిం వర్గానికి డిప్యూటి సీఎం పదవి కూడ ఇచ్చి అండగా నిలిచింది. దీంతో ముస్లింలు ఎంతో కొంత ఖుషీగా ఉన్నారనే భావన జగన్ సర్కార్ వచ్చాక ఏర్పడింది. తాజాగా దుల్హన్ పథకం విషయంలో వెనక్కి తగ్గడంతో ఆ వర్గానికి చెందిన వారు ఉసూరు మంటున్నారు.